ENG vs SA: 45 ఓవర్లలోనే వన్డే మ్యాచ్ ఫినిష్.. సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిన ఇంగ్లాండ్

ENG vs SA: 45 ఓవర్లలోనే వన్డే మ్యాచ్ ఫినిష్.. సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిన ఇంగ్లాండ్

వన్డే క్రికెట్ లో ఇంగ్లాండ్ నానాటికీ దిగజారుతూ వస్తోంది. రెండేళ్లుగా వన్డే క్రికెట్ అంటే ఇంగ్లీష్ క్రికెట్ జట్టు ఘోరంగా ఆడుతున్నారు. భారత వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో గ్రూప్ దశలో ఓడిపోవడం.. ఆ తర్వాత సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇండియాపై సిరీస్ పరాజయం.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టడం ఆ జట్టును కృంగదీశాయి. జట్టు చూడడానికి పేపర్ మీద బలంగా కనిపించినప్పటికీ ఒక్కరు కూడా నిలకడగా రాణించలేకపోతున్నారు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో చిత్తుగా ఓడిపోయారు. 

లీడ్స్‌ వేదికగా హెడింగ్లీలో మంగళవారం (సెప్టెంబర్ 2) జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ కేవలం 131 పరుగులకే ఆలౌటైంది. జెమీ స్మిత్ 54 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగిలినవారు ఘోరంగా విఫలమయ్యారు. ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 81 పరుగులతో పటిష్టంగా ఉన్న ఇంగ్లాండ్ తమ చివరి 8 వికెట్లను 49 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ 4 వికెట్లు పడగొట్టి ఆతిధ్య జట్టును ముప్పుతిప్పలు పెట్టాడు. ముల్డర్ మూడు వికెట్లు తీసుకున్నాడు.

ALSO READ : ICC Men's ODI Rankings: పసికూన ప్లేయర్‌కు టాప్ ర్యాంక్.. నంబర్ 1 వన్డే ఆల్ రౌండర్‌గా జింబాబ్వే ప్లేయర్

132 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 20.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి గెలిచింది.  వైస్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్  (86) 23 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి మ్యాచ్ ను త్వరగా ముగించాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ బేకర్ ను టార్గెట్ చేస్తూ మార్క్రమ్ మొదటి ఓవర్ లో మూడు బౌండరీలు కొట్టాడు. బేకర్ వేసిన రెండో ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. తొలి వికెట్ కు రికెల్ టన్ తో కలిసి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో ఆదిల్ రషీద్ మూడు వికెట్లు తీసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది.