హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్మించిన బుద్ధవనం వారసత్వ థీమ్ పార్క్ ఎంతో బాగుందని దక్షిణాసియా దేశాల ప్రతినిధులు చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన మలేషియా హైకమిషనర్ ముజఫర్ షాబిన్ ముస్తఫా, నేపాల్ రాయబారి డాక్టర్ శంకర్ ప్రసాద్ శర్మ, భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్‌సోప్ నాంగ్వెల్, థాయిలాండ్ రాయబారి చావనార్ట్ తంగ్ సుపంత్, ఆమె సెక్రటరీ రుచీ సింగ్ సోమవారం బుద్ధవనాన్ని సందర్శించారు.
వారికి బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో, కోలాటం, డప్పు నృత్యాల మధ్య స్వాగతం పలికారు. అనంతరం వారి బుద్ధ చరిత వనంలోని బుద్ధుడి పాదాల వద్ద, మహాస్తూపంలోని ఆచార్య నాగార్జున విగ్రహం వద్ద పుష్పాంజలి సమర్పించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న బుద్ధిస్ట్ డిజిటల్ ఎక్స్‌పీరియన్స్ మ్యూజియాన్ని, తెలంగాణలో బౌద్ధ వారసత్వంపై వీడియోలను వీక్షించారు. బుద్ధవనం ప్రత్యేకతల గురించి ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, బౌద్ధ విషయనిపుణులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు.
మహా స్తూపం అంతర్భాగంలోని ధ్యాన మందిరంలో సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లోని మహాబోధి బుద్ధ విహార డైరెక్టర్ బుద్ధ పాల ప్రత్యేక ప్రార్థనలు చేసి రాయబారులను ఆశీర్వదించారు. అనంతరం వారు మాట్లాడుతూ... అతి పెద్ద మహాస్థూపం, దాని చుట్టూ వేలాది శిల్పాలు, స్థూపాల నమూనాలు, శ్రీలంక బుద్ధుని శిల్పం, జాతక కథ శిల్పాలను ఒకేచోట చూడడం గొప్ప విషయం అన్నారు. 1700 సంవత్సరాల తర్వాత అమరావతి శిల్పకళకు మళ్లీ ప్రాణం పోశారని, మహాస్థూపం అంతర్భాగంలోని అలంకరణ ఎంతో ఆకట్టుకుందని చెప్పారు.
అనంతరం విజయ విహార్ అతిథి గృహానికి చేరుకొని, తెలంగాణ టూరిజం లాంచీలో నాగార్జునసాగర్ జలాశయంలో విహరించారు. వారి వెంట తెలంగాణ టూరిజం హోటల్స్ జీఎం నాథన్, ఏజీఎం జంగయ్య, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, బుద్ధవనం ఆర్ట్ ప్రమోషన్స్ మేనేజర్ శ్యాంసుందర్‌రావు, లాంచీ యూనిట్ మేనేజర్ హరి, విజయ విహార్ మేనేజర్ కిరణ్, సీఐ శ్రీనునాయక్, ఎస్సైలు ముత్తయ్య, ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వేణు, రెవెన్యూ ప్రొటోకాల్ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
