సౌత్​ సెంట్రల్​ రైల్వేకు 13,786 కోట్లు

సౌత్​ సెంట్రల్​ రైల్వేకు 13,786 కోట్లు
  • గతేడాదితో పోలిస్తే 65 శాతం ఎక్కువ: జీఎం అరుణ్​​కుమార్ జైన్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ లో దక్షిణ మధ్య రైల్వేకు రూ.13,786.19 కోట్లు కేటాయించారని, గతేడాదితో పోలిస్తే 65% ఎక్కువని సౌత్​ సెంట్రల్​ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్  చెప్పారు. ఇందులో తెలంగాణకు రూ.4,418 కోట్లు అలాట్​ చేశారని, గతేడాదితో పోలిస్తే ఇది 45% ఎక్కువని చెప్పారు. శుక్రవారం సికింద్రాబాద్​ రైల్ నిలయంలో బడ్జెట్ కేటాయింపు వివరాలను ​జైన్ మీడియాకు వెల్లడించారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిధులను విడుదల చేయడం లేదని, ఇటీవల కొత్త సీఎస్ శాంతికుమారిని కలిసినపుడు ఈ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందే భారత్ ట్రైన్స్ వస్తున్నాయన్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. దీనిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.

కీలక ప్రాజెక్టులకు నిధులు

ఎంఎంటీఎస్ ఫేజ్ 2కు బడ్జెట్ లో కేంద్రం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, రూ.600 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.817 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రూ.480 కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కేంద్రం తన వాటా కంటే ఎక్కువ ఖర్చు చేసి పనులు చేస్తున్నట్లు జీఎం తెలిపారు. కాజీపేట పీవోహెచ్ వర్క్ షాప్ కు రూ.160 కోట్లు, చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు రూ.82 కోట్లు, రోడ్ సేఫ్టి పనులకు (లెవల్ క్రాసింగ్‌‌‌‌‌‌‌‌లు, బ్రిడ్జిలు ఆర్ ఓబీ/ఆర్ యూబీ)లకు 768.14 కోట్లు, ట్రాక్ ల పునరుద్ధరణ పనులకు రూ.1,360 కోట్లు, స్టేషన్ల అభివృద్ధికి రూ.215 కోట్లు, స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాంల ఎత్తు పెంచటానికి రూ.53.43 కోట్లు కేటాయించారన్నారు.

రికార్డ్ స్థాయిలో ఎలక్ట్రిఫికేషన్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 638 రూట్ కిలోమీటర్లలో ఎలక్ట్రిఫికేషన్​ పనులు పూర్తయ్యాయని జీఎం వెల్లడించారు. ఎలక్ట్రిఫికేషన్​కు ప్రస్తుత బడ్జెట్ లో రూ.588 కోట్లు కేటాయించారని తెలిపారు. తెలంగాణ, ఏపీ, కర్నాటకలో బై-పాస్ లైన్ల(విజయవాడలో 19.5 కి.మీ, కాజీపేట 10.65 కి.మీ, రేణిగుంట 9.6 కి.మీ, వాడి 7.6 కి.మీ, గుత్తి 3.8 కి.మీ) నిర్మాణానికి రూ.383.12 కోట్లు కేటాయించారని తెలిపారు.