బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథుర్

బెల్లంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు : దక్షిణ మధ్య రైల్వే జీఎం సందీప్ మాథుర్

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) జనరల్ మేనేజర్ ​సందీప్ మాథుర్ తెలిపారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌ను​సోమవారం ఆయన తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్​లో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

 స్టేషన్‌లో నిర్మాణంలో ఉన్న మూడో ప్లాట్‌ఫారాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని, ఆర్వోహెచ్ డిపో షెడ్‌ను విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. కొత్తగా నిర్మిస్తున్న సిక్ లైన్ షెడ్‌లో క్రేన్ల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్వోహెచ్ డిపోలో వ్యాగన్ల రిపేర్లు స్పీడప్ చేయాలని సూచించారు. 

కొత్త క్వార్టర్స్ నిర్మించాలి

మజ్దూర్ యూనియన్ చైర్మన్ ఎస్.నాగరాజు, కార్యదర్శి జి.సాంబశివుడు జీఎం‌ను కలిశారు. బెల్లంపల్లి, మంచిర్యాలల్లో కార్మికులకు కొత్త క్వార్టర్స్ నిర్మించాలని, బెల్లంపల్లి రైల్వే డిస్పెన్సరీలో అన్ని రకాల చికిత్సలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించాలని, అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రైల్వే కాలనీలో నివసిస్తున్న కార్మికులకు గోదావరి నీటిని సరఫరా చేయాలని కోరారు.

 స్పందించిన జీఎం, రైల్వే కాలనీలో సౌకర్యాల మెరుగుదలకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బెల్లంపల్లి డిపో నుంచి వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న లోకో పైలట్లకు 120 మైలేజీ వర్తింపజేయాలని ఆలిండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ సెక్రటరీ అజయ్ కుమార్, అసిస్టెంట్ సెక్రటరీ రవీందర్‌ జీఎం‌కు వినతిపత్రం అందజేశారు. 

ఎక్స్​ప్రెస్, సూపర్‌ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ ​ఇవ్వాలి

బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో జీటీ, నవజీవన్, కేరళ, ఏపీ ఎక్స్​ప్రెస్, నాగ్‌పూర్​–హైదరాబాద్ ఎక్స్​ప్రెస్‌కు హాల్టింగ్​కల్పించాలని, ఎక్స్​ప్రెస్ కోచ్ ల్యాబ్‌ను బెల్లంపల్లిలో ఏర్పాటు చేయాలని సీపీఐ టౌన్ సెక్రటరీ ఆడెపు రాజమౌళి, సీనియర్ నాయకుడు చిప్ప నర్సయ్యలు జీఎం‌కు వినతిపత్రం అందజేశారు.