
- సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్ వెల్లడి
- ప్రతి బుధవారం ప్రజలతో ముఖాముఖి నిర్వహించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు ప్రతి బుధవారం బస్తీలు, కాలనీల్లో పర్యటించి ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించాలని సదరన్ డిస్కం సంస్థ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. సోమవారం మింట్ కాంపౌండ్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, ఎస్ఈలు, డీఈలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫారూఖీ మాట్లాడుతూ సంస్థ పరిధిలో 11 కేవీ ఫీడర్లు 8,681 ఉన్నాయన్నారు. 6,885 ఫీడర్లలో ఫీడర్ ఔటేజ్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
త్వరలో మిగిలిన ఫీడర్లలో ఈ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అలాగే విద్యుత్ డిమాండ్, సరఫరా, అంతరాయాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత ఇంజనీర్లను అప్రమత్తం చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈ వివరాల విశ్లేషణ ద్వారా సమర్థవంతమైన సేవలు అందించవచ్చన్నారు. ఇప్పటికే సబ్‌స్టేషన్లు, ఫీడర్లలో ఈ వ్యవస్థ అమలులో ఉందని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సరఫరా లోపాలను ఏఐ ఆధారిత సేవలు గుర్తిస్తాయని, దీంతో లోపాలను సరిదిద్దుకొని మరిన్ని మెరుగైన సేవలు అందించవచ్చన్నారు. డీటీఆర్ స్థాయిలో రోజువారీ విద్యుత్ సరఫరా పర్యవేక్షణ నిర్వహించాలని, తరచూ సమస్యలు ఎదుర్కొంటున్న ఫీడర్లు, డీటీఆర్ లపై డీఈలు, ఎస్ఈలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ డిమాండ్ ఏటా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది సమ్మర్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఆగస్టు 15లోగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు.