Beauty Review: ‘బ్యూటీ’ రివ్యూ.. యూత్‌ని టార్గెట్‌ చేసిన మారుతి రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ.. ఎలా ఉందంటే?

Beauty Review: ‘బ్యూటీ’ రివ్యూ.. యూత్‌ని టార్గెట్‌ చేసిన మారుతి రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ.. ఎలా ఉందంటే?

యంగ్ హీరో అంకిత్ కొయ్య, నీలఖి జంటగా జె.ఎస్.ఎస్. వర్ధన్ రూపొందించిన చిత్రం ‘బ్యూటీ’ (Beauty). జీ స్టూడియోస్, మారుతి టీం ప్రొడక్ట్స్, వానర సెల్యూలాయిడ్ బ్యానర్స్‌‌‌‌పై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ నిర్మించారు. ఇవాళ (సెప్టెంబర్ 19న) ఈ ‘బ్యూటీ’ మూవీ థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు, మిడిల్ క్లాస్ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చూపించే ప్రయత్నంగా మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.

‘మా సినిమా నచ్చితే నచ్చిందని నలుగురికి చెప్పండి.. నచ్చపోతే జీరో రేటింగ్ వేయండి’ అని మేకర్స్ ప్రమోషన్లలో  ధైర్యంగా చెప్పారు. దానికితోడు ఒక రోజు ముందుగానే రివ్యూవర్లందరికీ సినిమా చూపించారు. ఇలా గట్టి నమ్మకంతో యూత్‌ని టార్గెట్‌ చేసుకుని వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నట్లు, సినిమా ఆసక్తిగా నడిచిందా? లేదా? అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే:

హీరోయిన్ అలేఖ్య (నీలఖి) కాలేజీలో ఇంటర్‌ చదువుతూంటుంది. అలేఖ్య తండ్రి నారాయణ (వీకే నరేశ్‌) క్యాబ్ నడుపుతూ ఫ్యామిలీని రన్ చేస్తుంటాడు. అలేఖ్య తల్లి (వాసుకి) హౌస్‌వైఫ్‌. అలేఖ్య అంటే నారాయణకు వీపరీతమైన ప్రేమ. అడిగితే ఏదైనా ఇచ్చే తండ్రిగా ప్రేమను పంచుతాడు. అలా సరదాగా మిడిల్‌ క్లాస్‌ ఖర్చులతో ఫ్యామిలీ సాఫీగా సాగుతుంటుంది.

ఈ క్రమంలో అలేఖ్యకి స్కూటీపై మనసుపడుతుంది. స్కూటీ కావాలంటూ తండ్రి నారాయణని రిక్వెస్ట్ చేస్తుంది అలేఖ్య. అయితే, ఫస్ట్ డ్రైవింగ్ నేర్చుకో స్కూటీ ఇప్పిస్తా అని అంటాడు. ఇదే సమయంలో అలేఖ్యకి పెట్‌ ట్రైనర్‌ అర్జున్‌ (అంకిత్‌ కొయ్య) పరిచయం అవుతాడు. అలా అర్జున్ డ్రైవింగ్ నేర్పించే క్రమంలో ఒకరికొకరు లవ్ చేసుకుంటారు.

క్రమంలో వీరి మధ్య లవ్ చాలా లోతుగా వెళ్తుంది. ఓ రోజు ఇంట్లో ఎవ్వరులేని టైంలో అలేఖ్య-అర్జున్‌ ఏకాంతంగా కలుస్తారు. అలా పక్కింటి వాళ్ళు సడెన్గా వచ్చే చూసేసరికి అసహ్యించుకుంటారు. అప్పట్నుంచి అర్జున్‌ని దూరం పెడుతుంది అలేఖ్య. దగ్గరవ్వాలని అర్జున్ ప్రయత్నం చేసిన అలేఖ్య పట్టించుకోదు. ఇక అర్జున్ సైతం హర్ట్ అవుతాడు.

అర్జున్ని కూల్ చేయడం కోసం అలేఖ్య అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతుంటుంది. ఆ వీడియో కాల్‌లో తన అందం చూపించే ప్రయత్నం చేస్తూ, తన తల్లికి దొరికిపోతుంది. ఆ గొడవతో అలేఖ్య ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి అర్జున్‌తో లేచిపోతుంది.

హైదరాబాద్‌కు వచ్చిన అలేఖ్యకు ఎదురైన కష్టాలేంటి? అర్జున్‌-అలేఖ్యలను ఫాలో అవుతూ హైదరాబాద్‌ వచ్చిన మూడో వ్యక్తి ఎవరు? అర్జున్‌-అలేఖ్య మధ్యలోకి పోలీసులు ఎందుకు వస్తారు? అలేఖ్యను వెతుకుంటూ హైదరాబాద్‌కు వచ్చిన నారాయణ ఏమయ్యాడు? చివరికి అర్జున్‌-అలేఖ్య ప్రేమకథ ఎంతవరకు వెళ్లిందనేది మిగతా కథ.

ఎలా ఉందంటే:

బ్యూటీ సినిమాలో ఇప్పటి జనరేషన్‌‌‌‌ యూత్ తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న చిన్న సరదాలకే అవతలి వ్యక్తికీ ప్రేమను వ్యక్తపరచడం, తద్వారా పేరెంట్స్ ప్రేమని కాదని ఇంట్లో నుంచి వెళ్లిపోవడం వంటి అంశాలతో బ్యూటీ తెరకెక్కింది. తల్లికూతుర్ల మధ్య ఉండాల్సిన అవగాహన, బాధ్యత, కూతురిపై తండ్రికి ఉండే ప్రేమను కళ్ళకి కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు జేఎస్ఎస్ వర్ధన్. 

ఈ సినిమాలో జరిగేది.. మనం రోజు చూసే కథే.. చాలామంది జీవితాల్లో జరిగే కథే ఇది. ఇంకా అర్ధం అయ్యేలా చెప్పాలంటే.. కాలేజ్‌కి పంపిన 18 ఏళ్లు కూడా నిండని కూతురు.. ప్రేమలో పడి.. కన్న తల్లితండ్రులను ఎంత బాధపెట్టిందనేది బ్యూటీ కథ! ఈ సినిమా ద్వారా మిడిల్ క్లాస్ కలల్ని, కష్టాల్ని చూపిస్తూనే, పక్కదారి పడుతున్న యువత ప్రేమని ఆలోచింపజేసేలా చెప్పుకొచ్చాడు దర్శకుడు జేఎస్ఎస్ వర్ధన్. 

ఇకపోతే.. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా అలేఖ్య గురించి, తాను కోరుకునే బండి, బండి కోసం నాన్న పడే కష్టం, అర్జున్ తో అలేఖ్య లవ్ స్టోరీ నడిపించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సాగే రొమాంటిక్ వీడియో కాల్.. ఆ తర్వాత వచ్చే ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ సెకండ్ హాఫ్పై క్యూరియాసిటీ పెంచుతుంది. ఇది ఎవ్వరు ఊహించరు.. అలా ఉంటుంది ట్విస్ట్. సాధారణంగా ఆ ట్విస్ట్ చాలా సినిమాల్లో ఉన్నదే.. కానీ, బ్యూటీ సినిమాని మొదటి నుంచి నడిపిన తీరుకి ఆడియన్స్ షాక్ అయ్యేలా ఉంటుంది.

ఇక అప్పటినుంచి సినిమాలో ఎమోషన్స్, ట్విస్టులు, హీరో అరెస్ట్ అవ్వడం వంటి సీన్స్తో వేగం పెరుగుతుంది. అయితే, ఇందులో వచ్చే కొన్ని ప్రధాన సీన్స్.. తెరపై చూస్తుంటే గుండె బరువెక్కడం ఖాయం. కనుకే, ఆ సీన్స్ రివీల్ చేయకపోవడమే రివ్యూకి ఉత్తమం! ఇక ముఖ్యంగా చెప్పాలంటే.. ఈ బ్యూటీ కథకి హీరో.. హీరోయిన్ తండ్రి నారాయణే.

‘కూతురు అడిగింది కొనిచ్చేప్పుడు వచ్చే కిక్కు ఓ మధ్య తరగతి తండ్రికే తెలుస్తుంది.. తన కోసం కొంచెం కష్టపడాలి.. పడతాను’, ‘నువ్వూ.. క్యాబ్ డ్రైవర్ కూతురివే.. కలెక్టర్ కూతురివి కాదు.. ఉన్నంతలో సర్దుకోవాలి’, ‘కన్నా మన పేరెంట్స్‌కి మన మీద ప్రపంచాన్నే కొనిచ్చేయాలన్నంత ప్రేమ ఉంటుంది’, ‘ఆ బైక్ ఎంత ఉంటుందంటావ్?.. మన కారు సంవత్సరం ఈఎమ్ఐ ఎంత ఉంటుందో.. ఆ బైక్ అంత ఉంటుంది’ వంటి డైలాగ్స్ ఆలోచింపదగ్గట్టుగా ఉన్నాయి. 

ఎవరెలా నటించారంటే:

బ్యూటీలో అంకిత్, నీలఖిల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇందులో హీరో అంకిత్ కొయ్య రెండు భిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ఇన్నాళ్లు కామెడీ యాంగిల్ మెప్పించిన అంకిత్.. ఫస్ట్ టైం తన పర్ఫార్మెన్స్తో అలరించాడు. నీలఖి అల్లరి పిల్లలా నటిస్తూనే చివర్లో ఎమోషన్స్ పండించింది.

హీరోయిన్ తల్లిగా చేసిన వాసుకి అయితే.. మధ్యతరగతి గృహిణి పాత్రకి వన్నెతెచ్చింది. మధ్యతరగతి తండ్రిగా నారాయణ పాత్రలో సీనియర్ నటుడు నరేష్ జీవించిపోయారు. సినిమాకు ఓ రకంగా హీరోగా నిలిచి, తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించేలా చేశాడు. ప్రసాద్ బెహరా కామెడీ ఆకట్టుకుంటుంది. నటులు మురళీధర్ గౌడ్, నాగేంద్ర, నితిన్ ప్రసన్న ముఖ్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక అంశాలు:

ఆర్‌.వి. సుబ్రహ్మణ్యం కథ, స్క్రీన్‌ప్లేతో మెప్పించారు. కథ కోసం ఎంచుకున్న పాయింట్ పాతదే అయినప్పటికీ, స్క్రీన్ ప్లేతో ఆ లోటు లేకుండా చేశాడు. కథలోని అంశాలకు తనదైన కోణంలో తెరకెక్కించి డైరెక్టర్ జె.ఎస్‌.ఎస్‌. వర్ధన్‌ సక్సెస్ అయ్యాడు. విజయ్‌ బుల్గానిన్‌ తన సోల్ ఫుల్ సాంగ్స్తో, బీజీఎంతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచాడు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఎస్‌ బీ ఉద్దవ్‌ ఎడిటింగ్‌ మెప్పించింది. నిర్మాణవిలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.