రాష్ట్రంలోకి రుతుపవనాలు ..జోగులాంబ గద్వాల జిల్లాలోకి ఎంట్రీ..     తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. 

రాష్ట్రంలోకి రుతుపవనాలు ..జోగులాంబ గద్వాల జిల్లాలోకి ఎంట్రీ..     తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. 
  • రాష్ట్రంలోకి రుతుపవనాలు
  • జోగులాంబ గద్వాల జిల్లాలోకి ఎంట్రీ
  •  రెండు, మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ 
  • తగ్గుతున్న ఉష్ణోగ్రతలు.. పలు జిల్లాల్లో వర్షం  
  • వారం రోజులు భారీ వర్షాలు..  ఐఎండీ ఎల్లో అలర్ట్ 

హైదరాబాద్, వెలుగు: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. తాజాగా  వర్షాకాలం ప్రారంభానికి సూచనగా చెప్పే మృగశిర కార్తె (సోమవారం) నాడే జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ఎంటర్ కావడం విశేషం. నిరుటితో పోలిస్తే 8 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు రాష్ట్రంలోకి  వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 

ఇటు పొరుగు రాష్ట్రం ఏపీలోని రాయలసీమ ప్రాంతం మొత్తానికి రుతుపవనాలు వ్యాపించాయి. కాగా, 
రాష్ట్రంలో వారం  పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. 


తగ్గుతున్న ఉష్ణోగ్రతలురుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావం ఉండగా.. దక్షిణ జిల్లాల్లో పూర్తిగా తగ్గాయి. అత్యధికంగా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని వంకులంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల జిల్లా తాండూరులో 42.7, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో 42.5, జగిత్యాల జిల్లా గుళ్లకోటలో 42.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గరిమెళ్లపాడులో 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 7 జిల్లాల్లో 41 డిగ్రీలు, 6 జిల్లాల్లో 40 డిగ్రీల మేర రికార్డ్ అయ్యాయి.

మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీల లోపు నమోదయ్యాయి. అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో 34.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. వికారాబాద్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో 35 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. కాగా హైదరాబాద్ లోనూ 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.