నేడో రేపో రాష్ట్రానికి రుతుపవనాలు..ఇయ్యాల్టి నుంచి 4 రోజులు వర్షాలు పడే చాన్స్​

నేడో రేపో రాష్ట్రానికి రుతుపవనాలు..ఇయ్యాల్టి నుంచి 4 రోజులు వర్షాలు పడే చాన్స్​
  • నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో వానలు
  • ఇయ్యాల్టి నుంచి 4 రోజులు వర్షాలు పడే చాన్స్​

హైదరాబాద్, వెలుగు: వారం పది రోజుల పాటు ఏపీ, కర్నాటక సరిహద్దుల్లోనే ఉండిపోయిన నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. మంగళవారం ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించినట్టు హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమ నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలు సహా కొన్ని కోస్తాంధ్ర ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణ సహా దక్షిణాది మొత్తం విస్తరిస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 

ఆ ప్రభావంతో గుంటూరు, కృష్ణా జిల్లాలకు సరిహద్దు జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా మర్రిగూడలో 2.6, యాదాద్రి జిల్లా అడ్డగూడూరులో 2.6, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో 2.3, నల్గొండ జిల్లా హాలియాలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్​ సిటీలోనూ వాతావరణం కొద్దిగా చల్లబడింది. 

కొనసాగిన హీట్​వేవ్స్​

పలు చోట్ల వర్షాలు పడినా అదేస్థాయిలో హీట్​వేవ్స్​ కూడా కొనసాగాయి. ఆదిలాబాద్​, నల్గొండ, కొత్తగూడెం, మెదక్, నిజామాబాద్​, పెద్దపల్లి జిల్లాల్లో వడగాడ్పులు వీచాయి. టెంపరేచర్లు 45 డిగ్రీలకన్నా తక్కువగానే నమోదైనా.. సాధారణానికి మించి ఐదారు డిగ్రీలు ఎక్కువగానే రికార్డయ్యాయి. నల్గొండ జిల్లా కట్టంగూరులో అత్యధికంగా 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దపల్లి జిల్లా ఈసాల తక్కళ్లపల్లిలో 44.6, కమాన్​పూర్​లో 44.5, కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లా కెరమెరిలో 44.4, ములుగు జిల్లా మేడారంలో  44.2, జగిత్యాల జిల్లా వెల్గటూర్​లో 43.9, కరీంనగర్​ జిల్లా వీణవంకలో 43.7 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. అయితే, బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ వెల్లడించింది.