నరేశ్​ వెనుక ఉన్నది బీఆర్ఎస్సే: ఎంపీ సోయం బాపురావు

నరేశ్​ వెనుక ఉన్నది బీఆర్ఎస్సే: ఎంపీ సోయం బాపురావు

భైంసా, వెలుగు: అయ్యప్ప స్వామి, హిందూ దేవుళ్లపై బైరి నరేశ్​చేసిన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్​సర్కారు కుట్ర దాగి ఉందని ఆదిలాబాద్​ఎంపీ సోయం బాపురావు అన్నారు. శనివారం బాసర అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భైంసాలోని జిన్నింగ్​ఫ్యాక్టరీలో ఆయన మాట్లాడారు. మరో ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్​ఇలాంటి కుట్రలు చేస్తోందన్నారు. నరేశ్​పై రాష్ట్రవ్యాప్తంగా 150కి పైగా కేసులు అయ్యాయని, అతడిపై పీడీ యాక్టు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. భైంసాలో హిందూ యువకులపై ఒకట్రెండు కేసులు నమోదైతేనే పీడీ యాక్టు పెట్టి ఇబ్బందుల పాలు చేశారని అన్నారు.

హిందూ దేవుళ్లను కించపర్చేవారిపై కేసులు పెట్టేందుకు కేసీఆర్​సర్కారు భయపడుతోందన్నారు. దీనంతటికి కారణం బీఆర్ఎస్​ స్టీరింగ్​ఎంఐఎం చేతిలో ఉండడమేనన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్​మరిన్ని కుట్రలు పన్నేందుకు ప్రయత్నాలు చేస్తారని, బీజేపీ శ్రేణులంతా అలర్ట్​గా ఉండాలని సూచించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​చేపట్టిన పాదయాత్ర గత నెల భైంసాలో ప్రారంభమై కరీంనగర్​లో విజయవంతంగా ముగిసిందని, ఇందుకు కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో ఆదిలాబాద్​ పార్లమెంట్​ కన్వీనర్​అయ్యన్నగారి భూమయ్య, బాల్కొండ నియోజకవర్గ పాలక్​ ఇన్​చార్జీ రామారావు పటేల్​తదితరులు పాల్గొన్నారు.