సోయా కొనుగోలు ఎప్పుడు..! ..పొలాల్లోనే ధాన్యం నిల్వలు చేసి రైతుల ఎదురుచూపులు

సోయా కొనుగోలు ఎప్పుడు..! ..పొలాల్లోనే ధాన్యం నిల్వలు చేసి రైతుల ఎదురుచూపులు
  •     ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని అధికారులు
  •     ఆందోళనలో అన్నదాతలు 
  •     జిల్లావ్యాప్తంగా 62,500 వేల ఎకరాల్లో సోయా సాగు

ఆదిలాబాద్, వెలుగు :  సోయా పంట కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పంట చేతికొచ్చి 15 రోజులైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్​ జిల్లాలో రైతులు పత్తి తర్వాత సోయ పంట అధికంగా సాగు చేస్తారు. ఈ ఏడాది వర్షాకాలంలో 62,500 వేల ఎకరాల్లో సోయ సాగు చేశారు.సోయ కాయ, పూత దశలో ఉన్న సమయంలో అధిక వర్షాలతో 3 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. 

వర్షాల కారణంగా ఎకరానికి 10 క్వింటాళ్లు వచ్చే సోయా 6 నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి.. కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. 

పొలాల్లోనే సోయా కుప్పలు..

జిల్లాలో 80 శాతం సోయం పంట కోతలు పూర్తయ్యాయి. ఏటా మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం పంట చేతికొచ్చి పొలాల్లోనే కుప్పలు వేసి రైతులు ఎదురుచూస్తున్నారు. కొంతమంది ఖాళీ ప్రదేశాలు.. రోడ్లపైన కుప్పలుగా పోసుకుంటున్నారు. వర్షానికి తడిసిపోకుండా కాపలా కాస్తున్నారు. దీనికి తోడు ఉదయం మంచుకురుస్తుండడంతో సోయాలో తేమ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయని రైతులు వాపోతున్నారు. సాధారణంగా సోయా పంట కోత పూర్తయిన రెండు మూడు రోజుల్లోనే మార్కెట్ కు తరలిస్తుంటారు. 

కానీ ఈసారి మాత్రం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో రోజుల తరబడి నిల్వ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ప్రైవేట్ లో అమ్ముకుంటున్నప్పటికీ క్వింటాల్​కు రూ.4 వేలు కూడా రాకపోవడంతో ఆర్థికంగా రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.5,328గా నిర్ణయించింది. అయితే సమయానికి కొనుగోళు కేంద్రాలు ఏర్పాటు చేయకపోడంతో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. బుధవారం బోథ్ మండల కేంద్రంలో సోయా పంట కొనుగోలు చేయాలని రైతులు  ధర్నా చేపట్టారు. 

సోయా కొనుగోలను వెంటనే ప్రారంభించాలి 

నేను 8 ఎకరాల్లో సోయా పంట సాగు చేశా. ఈసారి పంట దిగుబడి తగ్గిపోయింది. అధిక వర్షాలతో ఎకరానికి 7 క్వింటాళ్లు మాత్రమే పంట వచ్చింది. ఇప్పుడు పంట చేతికొచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌- కుమ్మరి విజయ్ కుమార్, రైతు, బోథ్ 

పంట ఆరబెట్టుకునేందుకు అవస్థలు పడుతున్నాం

ఈ ఏడాది ఆరు ఎకరాల్లో సోయా పంట సాగు చేశా. పంట కోసి15 రోజులు గడుస్తున్నా ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో పొలాల్లో పంటను ఆరబెట్టుకునేందుకు అవస్థలు పడుతున్నాం. ఇప్పటికే అధిక వర్షాలతో పంట నష్టపోయాం. ఇప్పుడు అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నాం. - పుదారి శేఖర్, రైతు అంకోలి