ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఈ నెల 4న ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో 700 మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అఖిల్మహాజన్తెలిపారు. పట్టణంలోని ఎస్టీయూ భవన్లో బుధవారం పోలీస్అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇద్దరు అడిషనల్ఎస్పీలు, ఏడుగురు డీఎస్పీలు, 20 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 350 మంది కానిస్టేబుల్స్, 60 మంది మహిళా సిబ్బంది, 40 స్పెషల్ పార్టీ పోలీసులు, మిగితా సిబ్బందిని 9 సెక్టార్లుగా విభజించి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
పోలీసులు తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. సమావేశానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించాలన్నారు. టూవీలర్ పార్కింగ్ ను రాంలీలా మైదానం, స్థానిక సైన్స్ డిగ్రీ కళాశాల, ఆటోలు, కార్ల పార్కింగ్ ను డైట్ కాలేజీ గ్రౌండ్, భారీ వాహనాలు, బస్సులను తిరుమల పెట్రోల్ బంక్ ముందు నుంచి మావల పోలీస్ స్టేషన్ మీదుగా ట్రైబల్ రెసిడెన్షియల్ బాయ్స్ కాలేజీలో పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సమావేవంలో అడిషనల్ఎస్పీలు కాజల్ సింగ్, బి.సురేందర్ రావు, ఏఎస్పీ పి.మౌనిక, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్.జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
