శాంతి, భద్రతల పరిరక్షణకే నాకాబందీ : ఎస్పీ పరితోశ్ పంకజ్

శాంతి, భద్రతల పరిరక్షణకే నాకాబందీ : ఎస్పీ పరితోశ్ పంకజ్

ఎస్పీ పరితోశ్ పంకజ్

జహీరాబాద్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణ కోసమే నాకాబందీ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ అన్నారు. గురువారం రాత్రి మొగుడంపల్లి మండలం మాడిగి సమీపంలో జాతీయ రహదారిపై పోలీసు సిబ్బందితో వాహనాల తనిఖీ, నాకాబందీ నిర్వహించారు. 

ఎస్పీ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు  ఉండడం వల్ల గంజాయి, గుట్కా, అక్రమ మద్యం, మాదక ద్రవ్యాలు, పీడీఎస్​రైస్ అక్రమ రవాణా అవుతున్నాయన్నారు. వాటిని అరికట్టేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. 80 మంది పోలీస్ సిబ్బందిని వివిధ బృందాలుగా విభజించి నాకాబందీ చేపట్టి ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. 

ఈ తనిఖీల్లో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా కారులో తరలిస్తున్న మద్యం స్వాధీనం చేసుకోవడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపిన 9 మందిపై డ్రంకన్​డ్రైవ్​కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీ సైదా నాయక్,  సీఐలు శివలింగం, రవీందర్ రెడ్డి, కిరణ్ కుమార్, వెంకటేశ్, శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.