నేషనల్ హైవేపై ట్రాఫిక్ సమస్య తలెత్తొద్దు : ఎస్పీ శరత్ చంద్రపవార్

నేషనల్ హైవేపై ట్రాఫిక్ సమస్య తలెత్తొద్దు : ఎస్పీ శరత్ చంద్రపవార్
  •     చిన్నకాపర్తి, చిట్యాల పరిధిలోని గుంతల రోడ్లను పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్రపవార్ 
  •     ‘వెలుగు’  కథనానికి స్పందన  

చిట్యాల, వెలుగు: రానున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో వాహనాల రద్దీ పెరిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్‌హెచ్‌–65 చిట్యాల, పెద్దకాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి, పనుల పురోగతి, ట్రాఫిక్ డైవర్షన్ మార్గాలు, వాహనాల రాకపోకలను పరిశీలించారు.  

పండుగ రోజుల్లో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. సర్వీస్ రోడ్లపై ఏర్పడిన గుంతలు, దెబ్బతిన్న రోడ్ల వల్ల ప్రమాదాల అవకాశం ఉందని గుర్తించిన ఎస్పీ, తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, సూచికలు ఏర్పాటు చేయాలని తెలిపారు.  రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అదనపు ట్రాఫిక్ పోలీసులను నియమించాలని సూచించారు.  

డైవర్షన్ మార్గాలను స్పష్టంగా చూపించడంతో పాటు రాత్రి వేళల్లో సరిపడా లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. బైక్‌లు , భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.  ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తయ్యేలా రోడ్డు నిర్మాణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమన్వయం చేస్తామని స్పష్టం చేశారు. ఈ పరిశీలనలో  నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్సై రవికుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.