క్రూ10 మిషన్ వాయిదా.. సునీతా విలియమ్స్‎ భూమిపై రాకకు మళ్లీ బ్రేక్

క్రూ10 మిషన్ వాయిదా.. సునీతా విలియమ్స్‎ భూమిపై రాకకు మళ్లీ బ్రేక్

వాషింగ్టన్: దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌‎కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమెను అంతరిక్షం నుంచి తిరిగి భూమి పైకి తీసుకొచ్చే మిషన్ మరోసారి వాయిదా పడింది. దీంతో సునీతా విలియమ్స్ భూమీ మీదకు రావడం మరికొంత ఆలస్యం కానుంది. సునీతాతో పాటు వెళ్లిన మరో ఆస్ట్రోనాట్ బచ్‌ విల్మోర్‎కు కూడా నిరీక్షణ తప్పడం లేదు. 

2024 జూన్‎లో ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బచ్‌ విల్మోర్, నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌ మిషన్ క్రూ 9 ప్రాజెక్ట్‎లో భాగంగా బోయింగ్‌ స్టార్‌లైనర్‌ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లారు. నాసా షెడ్యూల్ ప్రకారం స్పేస్‎లో వీరి పర్యటన వారం రోజులు. కానీ.. వీరు వెళ్లిన బోయింగ్‌ స్టార్‌లైనర్‌‎లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ తిరిగి భూమి పైకి రాగా.. సునీత, బచ్‌ విల్మోర్ అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు. 

Also Read :- జియోలో వంద రూపాయల రీఛార్జ్ ప్లాన్ వచ్చేసింది

వీరిని తిరిగి భూమీ మీదకు తీసుకొచ్చేందుకు నాసా పలుమార్లు ప్రయత్నించగా.. ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు. దీంతో సునీతా, బచ్‌ విల్మోర్ 9 నెలలుగా అంతరిక్షంలోనే ఉన్నారు. అప్పటి నుంచి భూమి పైకి వచ్చేందుకు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు  చేపట్టిన ట్రంప్.. స్పేస్‎లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా, విల్మోర్‎ను వెంటనే భూమిపైకి తీసుకురావాలని నాసా, ఎలన్ మస్క్‎ను ఆదేశించారు. 

దీంతో నాసా, మస్క్ స్పేస్‎ఎక్స్ క్రూ10 మిషన్ లాంఛ్ చేసింది. ఈ మిషన్‎లో భాగంగా ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా నలుగురు వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపనుంది. వీరు ఐఎస్ఎస్ కు వెళ్లిన తర్వాత.. సునీతా, విల్మోర్ భూమి మీదకు రానున్నారు. ఈ క్రమంలోనే 2025, మార్చి 12న ఫాల్కన్ 9 రాకెట్‎ను నింగిలోకి పంపేందుకు నాసా రెడీ అయ్యింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్‌ 9 రాకెట్‌ బయలుదేరేందుకు సిద్ధమవగా.. చివరి నిమిషంలో రాకెట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. 

హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ రావడంతో లాస్ట్ మినిట్లో క్రూ 10 మిషన్ ఆగిపోయింది. సాంకేతిక సమస్య వల్ల క్రూ 10 మిషన్ నిలిచిపోయినట్లు నాసా ప్రకటించింది. రాకెట్లో సమస్యను పరిష్కరించి.. సునీతా, విల్మోర్‎ను భూమి పైకి సేఫ్‎గా తీసుకొచ్చేందుకు ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు నాసా తెలిపింది. దీంతో సునీతా విలియమ్స్ రాకపై ఉత్కంఠ నెలకొంది.