వాయు కాలుష్యంపై గళమెత్తండి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపు

వాయు కాలుష్యంపై గళమెత్తండి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ పిలుపు
  • ఎయిర్ పొల్యూషన్ తో సామాన్యుల బతుకులు ఆగమైతున్నయ్
  • ‘ఆవాజ్ భారత్ కీ’ వేదిక ద్వారా  సూచనలు పంపవచ్చని వెల్లడి 

న్యూఢిల్లీ: వాయు కాలుష్యంపై ‘ఆవాజ్ భారత్ కీ’ ప్లాట్ ఫాం ద్వారా గళమెత్తాలని దేశవ్యాప్తంగా ప్రజలకు కాంగ్రెస్  ఎంపీ రాహుల్  గాంధీ ఆదివారం పిలుపునిచ్చారు. వాయు కాలుష్యంతో సామాన్యుల బతుకులు ఎలా ఆగమైపోతున్నాయో ఆ వేదిక ద్వారా తన కార్యాలయానికి సలహాలు, సూచనలు పంపవచ్చని ‘ఎక్స్’ లో ఆయన తెలిపారు. 

దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు చోట్ల గాలి కాలుష్యం తీవ్రం అవుతున్న నేపథ్యంలో ఈ సమస్యపై సామాన్యులు గళం ఎత్తేందుకు రాహుల్ ‘ఆవాజ్ భారత్ కీ’ అనే వేదికను ప్రారంభించారు. ‘‘వాయు కాలుష్యం వల్ల మనం భారీగా మూల్యం చెల్లిస్తున్నాం. ఈ సమస్యతో మన ఆరోగ్యంతో పాటు ఆర్థికవ్యవస్థ కూడా సతమతం అవుతోంది. కొన్ని కోట్ల మంది భారతీయులు  రోజూ ఈ బెడదను భరిస్తున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. 

సమాజంలోని బడుగు బలహీన వర్గాల వారే అత్యధికంగా గాలి కాలుష్యం బారినపడి దాని పరిణామాలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు కూడా బాధపడుతున్నారు. ఇక నిర్మాణ రంగ కార్మికులు, దినసరి కూలీలపై ఎయిర్ పొల్యూషన్  తీవ్రంగా ప్రభావం చూపుతున్నది’’ అని రాహుల్  పేర్కొన్నారు. 

వచ్చే చలికాలం వరకు ఈ సంక్షోభాన్ని మరిచిపోకూడదన్నారు. ఇప్పుడే ఈ సమస్యపై మనమంతా గళం ఎత్తాల్సిన అవసరం ఉందని రాహుల్  సూచించారు. ‘‘గాలి కాలుష్యం మిమ్మల్ని, మీరు ప్రేమించే వారిని ఏవిధంగా ప్రభావితం చేసిందో ‘ఆవాజ్ భారత్ కీ’ వేదికలో పంచుకోండి. మీ వాయిసే ముఖ్యం. మీ గొంతులను నేను మరింత ముందుకు తీసుకెళ్తాను” అని రాహుల్  అన్నారు.