స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ : హరీశ్ రావు

స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ : హరీశ్ రావు
  •     ఇది రాజ్యాంగాన్ని కాల రాయడమేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్, వెలుగు: రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలనూ దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి​నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ఎమ్మెల్యే హరీశ్​ రావు విమర్శించారు. ఇది సిగ్గుచేటని, ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ అని తెలిపారు. ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీసిన కాంగ్రెస్​ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ సేవ్​ ది కానిస్టిట్యూషన్​అసలు నినాదం.. స్పీకర్​ ఇచ్చిన తీర్పుతో తేలిపోయిందని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన ఫిరాయింపు చట్టం నియమాలను స్పీకర్​ పక్కనపెట్టారని విమర్శించారు.

అధికారపార్టీకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇస్తూ.. తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ కాంగ్రెస్​ పార్టీ, రాహుల్​ గాంధీ తన నిజస్వరూపాన్ని బయటపెట్టారని పేర్కొన్నారు. సేవ్​ ది కానిస్టిట్యూషన్​ నినాదం కేవలం మాటలకే పరిమితమైందన్నారు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు: వినోద్​ కుమార్​

స్పీకర్​ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని మాజీ ఎంపీ వినోద్​ కుమార్ అన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసమే పార్టీ మారినట్టు స్వయంగా ఎమ్మెల్యేలే చాలా సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. కానీ, స్పీకర్​ మాత్రం పార్టీ మారలేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్​అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్​లో ప్రత్యేక చట్టం చేయాలని, పదో షెడ్యూల్​లో రాజ్యాంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.