నిర్మలా సీతారామన్ అన్నీ అబద్దాలే మాట్లాడారు

నిర్మలా సీతారామన్ అన్నీ అబద్దాలే మాట్లాడారు

తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ఆదాయం పెరిగిందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 2022కి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ ప్రకటించారని ..ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు.  బాన్సువాడ నియోజకవర్గానికి వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ..NCDSపై అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. NCDS అనేది అప్పులిచ్చే సంస్థ అని...చేపల పంపిణికి కేంద్రం నిధులు ఇస్తుందంటూ అసత్యాలు చెప్పారని విమర్శించారు. తాను పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు NCDS ద్వారా అప్పు తెచ్చుకుని గొర్రెల కాపరులకు గొర్రెలకు ఇచ్చినట్లు గుర్తు చేశారు. దీంట్లో కేంద్రం ఒక్క రుపాయి కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు.

రైతు ఆత్మహత్యలు తగ్గాయి...
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో పంటకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకంతో పాటు.. 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పారు. అన్నదాతలు పండించిన పంటను పూర్తిగా కొనుగోలు చేస్తున్నామన్నారు. దీని వల్ల రైతుల ఆత్మహత్య లు గణనీయంగా తగ్గాయన్నారు.  ఫసల్ బీమాను రైతులే వద్దనుకున్నారని...వాటిలో ఉన్న లోపాల వల్ల కోర్టుకు వెళ్లి రైతులు బీమా కట్టమని ఆర్డర్ తెచ్చుకున్నారని గుర్తు చేశారు. 

డబుల్ బెడ్ రూం పథకం ఇతర రాష్ట్రాల్లో ఎందుకు లేదు..?
కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వడం లేదంటూ  నిర్మలా సీతారామన్ విమర్శించారని....మరి ప్రధాన్ మంత్రి కిసాన్ యోజనను కౌలు రైతులకు ఎందుకు అమలు చేయడం లేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నారని..బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకం ఎందుకు లేదన్నారు. కేంద్ర ఇచ్చే నిధులకు మూడింతలు కలిపి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నట్లు చెప్పారు. అటు సాగునీటి కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించినా..కేంద్రం ఇవ్వలేదన్నారు. 

సగం మీది..సగం మాది..
ఉచిత బియ్యం పథకంలో సగం కేంద్రానిది..సగం రాష్ట్ర ప్రభుత్వానిదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్రం 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తే..తాము అదనంగా ఒక కిలో కలిపి ఉచితంగా ఇస్తున్నామని స్పష్టం చేశారు.