సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ రోల్​మోడల్​ : స్పీకర్ ​ప్రసాద్ ​కుమార్​

సుస్థిరాభివృద్ధిలో తెలంగాణ రోల్​మోడల్​ : స్పీకర్ ​ప్రసాద్ ​కుమార్​
  • ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నది : స్పీకర్​ప్రసాద్​కుమార్​
  • 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ లో ప్రసంగం

న్యూఢిల్లీ, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం సుస్థిరాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు  మోడల్ గా నిలిచాయని శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సహకారంతో క్షేత్రస్థాయిలో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనునిత్యం పనిచేస్తున్నదని చెప్పారు. విద్య, ఆరోగ్యం, సమానత్వం, పరిశుభ్రమైన తాగునీరు, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో జాతీయ ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో పార్లమెంట్ భవనం లో నిర్వహించిన 10వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ ) ఇండియా రీజియన్​ కాన్ఫరెన్స్ లో  గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాటు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్​ ముదిరాజ్, లెజిస్లేటివ్ సెక్రెటరీ డాక్టర్​ వీ నరసింహాచార్యులు, జాయింట్ సెక్రెటరీ ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. 

మంగళవారం ‘‘సుస్థిరమైన – సమ్మిళిత అభివృద్ధిని సాధించడంలో శాసన సభల పాత్ర” అనే థీమ్ పై స్పీకర్​ప్రసాద్​కుమార్​ ప్రసంగించారు. సుస్థిరమైన అభివృద్ధి కోసం తెలంగాణ శాసనసభ రూపొందించిన చట్టాలు.. రాష్ట్రంతోపాటు జాతీయ, అంతర్జాతీయ చట్టాలకు తగ్గట్టుగా ఉన్నాయని చెప్పారు. 

తొలి వారంలోనే ఆరు గ్యారంటీలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలివారంలోనే ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టిందని స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరించారు. ఆ ఆరు స్కీంలు ప్రస్తుతం విజయవంతంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. తొలుత ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రమంతా మహిళలకు ఉచిత ప్రయాణం, రూ. 500 కే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేసినట్టు వెల్లడించారు. ఈ రెండు పథకాల అమలు రాష్ట్రంలో మహిళా సాధికారతకు తోడ్పడిందని చెప్పారు. 

ఖర్గేను కలిసిన స్పీకర్ ప్రసాద్ కుమార్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ అయ్యారు. స్పీకర్ గా తనకు అవకాశం కల్పించినందుకు ఖర్గే కు   కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఆదేశాలను ఈ సందర్భంగా హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కాగా, ప్రస్తుతం పార్టీ ఫిరాయింపుల అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తాను దానిపై మాట్లాడలేనని మీడియాతో అన్నారు.