- సన్నరకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలె
- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 7 వేల సెంటర్లు
- అవసరమైతే కొత్తగా ఐకేపీ సెంటర్లు
- గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉంచండి
- తాలు, తేమ పేరుతో మోసం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి
- రాష్ట్రంలో 100% సన్నవడ్లు పండిచేలా చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సన్నవడ్ల కొనుగోలుకు ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఏడాది నుంచి సన్న రకాలకు రూ. 500 బోనస్ ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు మొత్తం ఏడు వేల ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇవాళ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడుతూ.. అవసరమైన చోట కేంద్రాలను తెరవాలని సూచించారు. ఐకేపీ సెంటర్లకు సీరియల్ నంబర్ ఇవ్వాలని సన్నవడ్లపై ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని అన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో వ్యవసాయ అధికారులను ఇన్ వాల్వ్ చేయాలని సూచించారు.కలెక్టర్లు ప్రతి రోజూ ధాన్యం కొనుగోళ్లపై రెండు గంటలపాటు సమీక్ష చేయాలని సూచించారు. గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్లకు సూచించారు. కలెక్టర్లు క్షేత్ర పర్యటనలు చేయాలని అన్నారు.
తాలు,తరుగు,తేమ పేరుతో రైతులను మోసం చేసేవారిని సహించవద్దు. క్రిమినల్ కేసులు పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో వందశాతం రైతులు సన్నబియ్యం పండించేలా చొరవ చూపించాలని అన్నారు.