
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్వార్డుల్లోకి కొందరు గుట్కా, సిగరెట్లు, మద్యం తీసుకొస్తుండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. వ్యక్తిగతంగా తనిఖీలు చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. నిత్యం వేలాది మంది వచ్చే హాస్పిటల్లో ఇంతకు ముందు ఇలా తనిఖీలు లేకపోవడంతో గుట్కా, పాన్ మసాలాలు తిని వార్డుల్లోని గోడలపై ఉమ్మేయడంతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తేవి. తాటి కల్లు, మద్యం తెప్పించుకొని కొందరు పేషెంట్లు, వారి అటెండెంట్లు తాగడంతో గతంలో పలు సార్లు న్యూసెన్స్ఘటనలు జరిగాయి.
ఈ నేపథ్యంలోనే మెయిన్ బిల్డింగ్‌లోకి వెళ్లే ప్రతి ఒక్కరిని ఎంట్రెన్స్వద్ద తనిఖీ చేస్తున్నామని జీడీఎక్స్ కంపెనీ ప్రతినిధి రవికుమార్, సెక్యూరిటీ ఇన్చార్జ్ శివాజీ తెలిపారు. మహిళల కోసం మహిళా సెక్యూరిటీని, ఒక క్యాబిన్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. హాస్పిటల్ఆవరణలో తిరిగే అనుమానితులను పట్టుకొని అవుట్ పోస్ట్పోలీసులకు అప్పగిస్తున్నామన్నారు. వెహికల్స్ పార్కింగ్ పెద్ద సమస్యగా మారిందని, దీనిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.