నాన్చి.. నాన్చి ఎటూ తేల్చలే ! .. ఏండ్లుగా కొత్త రేషన్ కార్డులు పెండింగ్ 

నాన్చి.. నాన్చి ఎటూ తేల్చలే ! .. ఏండ్లుగా కొత్త రేషన్ కార్డులు పెండింగ్ 
  • సిటీలో లక్షన్నర మంది అప్లై  
  • ఎన్నికల్లోపు ఇస్తామన్న సర్కార్ 
  •  కోడ్‌‌‌‌ తో కార్డుల జారీ నిలిపివేత 
  • వ్యయ భారం పేరిట నిర్లక్ష్యం  
  • అర్హులకు అందని పథకాలు

హైదరాబాద్, వెలుగు: అర్హులకు రేషన్​ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలతో భారీగా అప్లయ్ చేసుకోగా చివరకు దరఖాస్తుదారులకు మొండి చేయి మిగిలింది. 2021 నవంబర్​లో జరిగిన హుజూరాబాద్​ బై పోల్​కు ముందు కూడా రేషన్​కార్డుల జారీ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత కొందరికి కార్డులు పంపిణీ చేసినా ఇప్పటికీ పెద్దసంఖ్యలో దరఖాస్తులు పెండింగ్​లో పెట్టింది.  రాష్ట్రంలో ఆహార భద్రత కార్డుల జారీ పేరుతో రేషన్​ కార్డుల జారీని చేపట్టిన ప్రభుత్వం హైదరాబాద్​పరిధిలోనూ జారీ చేసింది.

సర్కార్​పై  పథకాల భారం పడుతుందనే భయంతో కొద్దికాలానికే కొత్త కార్డుల జారీని నిలిపివేసింది. మళ్లీ కొంతకాలానికి  హైదరాబాద్​ సిటీలో  కొత్త కార్డులు ఇస్తామని సివిల్ సప్లయ్​అధికారులు కొత్త దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో మళ్లీ భారీగా దరఖాస్తులు వచ్చాయి. వాటికి కూడా మోక్షం లభించలేదు. 

లక్షన్నర మంది ఎదురుచూపు

హైదరాబాద్​లో రేషన్​ కార్డులకు భారీ సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయని పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. కొత్త కార్డుల గురించి మాత్రం ప్రభుత్వం ఏ ప్రకటనా చేయక పోవడంతో తాము కూడా జారీ చేయడం లేదని అధికారులు చెబుతున్నారు.హైదరాబాద్​లో 5.5 లక్షల కార్డులు ఉన్నాయి.రెండున్నరేళ్ల కిందట  ప్రభుత్వం చేసిన ప్రకటనతో మరో లక్షన్నర మంది దరఖాస్తు చేశారు. వీరిలో కొందరికి ఉన్నతస్థాయి  వర్గాల నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా కొందరికి రేషన్​కార్డులు లభించాయి. అయితే ఎన్నికల్లోగా మిగిలిన వారికి కొత్త కార్డులు జారీ చేస్తామని అధికారులు చెప్పగా... ఎన్నికల ప్రకటన రావడంతో మొత్తానికి బ్రేక్​ పడింది. దీంతో దాదాపు లక్షన్నర మంది దరఖాస్తుదారులు ఆందోళనలతో ఎదురు చూస్తున్నారు. 

పథకాల భారం పడుతుందనే ఆలస్యం

రాష్ట్రంలో కొత్త కార్డులను జారీ చేస్తే తద్వారా ప్రభుత్వంపై పథకాల భారం పడుతుందని, అందుకే రేషన్​ కార్డుల జారీని నిలిపి వేసినట్టు ఆరోపణ ఉంది. ప్రత్యేకంగా హైదరాబాద్​ జనాభా పెరిగిపోతుండగా.. వివిధ ప్రాంతాల నుంచి సిటీకి వలస వస్తున్న  కూలీలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు కొత్త కార్డుల అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అప్పుడూ ఇప్పుడూ అంటూ ప్రభుత్వం కూడా కొత్తగా జారీ ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది.

ALSO READ : వీడియో తీయ్.. ఫార్వర్డ్ చెయ్ !

తీరా ఎన్నికల కోడ్​ పేరుతో మొత్తం కార్డుల జారీకే బ్రేక్​పడింది. అయితే ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలు దళితబంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​, డబుల్​బెడ్​రూమ్ ఇండ్లు లాంటివన్నీ కూడా రేషన్​కార్డుతో ముడిపడి ఉన్నవే. తెల్లరేషన్​కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందడానికి అర్హులు అవుతారు. దీంతోచాలా మంది రేషన్​ కార్డుల కోసం నిరీక్షిస్తున్నారు. ఇప్పటికే పథకాల భారంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఇప్పుడు ఎన్నికల కోడ్​ పేరుతో కార్డుల జారీ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోగా పేదలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.