హెచ్‌టీ, ఎల్‌టీ బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ : సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్

హెచ్‌టీ, ఎల్‌టీ బకాయిల వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ : సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్
  • సంస్థలకు బిల్లులతో నోటీసు బోర్డులను ఏర్పాటు చేశాం: సదరన్ డిస్కం సీఎండీ ముషారఫ్​

హైదరాబాద్, వెలుగు: హైటెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్ వినియోగదారుల నుంచి మొండి బకాయిల వసూళ్ల కోసం తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్పీడీసీఎల్) సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. బిల్ స్టాప్డ్ హెచ్‌టీ సర్వీసుల ప్రాంగణాల వద్ద బకాయిల మొత్తాన్ని పేర్కొంటూ నోటీసు బోర్డులను ఏర్పాటు చేస్తున్నది. ఈ చర్యల ఫలితంగా బకాయిల వసూలు వేగవంతమైందని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ వెల్లడించారు. సదరన్ డిస్కం పరిధిలో 728 బిల్ స్టాప్డ్ హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయని.. వీటికి సంబంధించి రూ. 600 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.  

బిల్లులను చెల్లించాలని ఎన్నిసార్లు సంప్రదించినా స్పందన లేకపోవడంతో ఈ చర్యలకు దిగినట్లు చెప్పారు.  అలాగే, 9.19 లక్షల లోటెన్షన్ (ఎల్‌టీ) బిల్ స్టాప్డ్ సర్వీసుల నుంచి రూ. 188 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు హెచ్‌టీ సర్వీసుల నుంచి రూ. 100 కోట్లు వసూలైనట్లు సీఎండీ వివరించారు. కొంతమంది బకాయిల విషయం తెలియకుండా ఆయా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారని, ఆస్తి యాజమాన్యం మారినప్పటికీ బకాయిలు చెల్లించకపోతే కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదని చట్టం స్పష్టం చేస్తోందని ఫరూఖీ వెల్లడించారు.