హైదరాబాద్లో చికెన్ గున్యా నివారణకు స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్లో చికెన్ గున్యా నివారణకు స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: చికెన్ గున్యా కేసుల నివారణకు రేపటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టి, యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చికెన్ గున్యా కేసు నమోదైన ఇల్లు చుట్టుపక్కల 50 నుంచి వంద ఇళ్ల వరకు సర్వే చేయాలని, దోమలు పెరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ నీరు నిల్వ ఉన్నట్లయితే యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చేయాలని సూచించారు. 

తాళం వేసిన ఇండ్లు, భవన నిర్మాణ స్థలాలు, ఫంక్షన్ హాల్స్, ఓపెన్ ప్లాట్స్ ఏరియాలను సందర్శించి రెసిడెన్షియల్ వెల్ఫెర్ అసోసియేషన్ ప్రతినిధులతో చికెన్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికెన్ గున్యాకు సంబంధించిన రోగి వివరాలు, అడ్రస్ తో సహా విధిగా నమోదు చేయాలని తెలిపారు. క్షేత్ర పరిధిలో చికెన్ గున్యాను నియంత్రించేలా ఎంటమాలజీ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా అధికారులు సమన్వయంతో పనిచేసి నగరంలో చికెన్ గున్యా నివారణకు బాధ్యతగా పనిచేయాలని తెలిపారు.