న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాలకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నివేదిక సమర్పణ గడువును ఎలక్షన్ కమిషన్(ఈసీ) పెంచింది. తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌తో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లో సర్ గడువును పెంచుతున్నట్లు ఈసీ గురువారం వెల్లడించింది. దీని ప్రకారం.. తమిళనాడు, గుజరాత్‌లో నిర్వహించిన సర్ నివేదికను ఈ నెల 14 (ఆదివారం)న సబ్మిట్ చేయాల్సి ఉండగా, 19వ తేదీకి గడువును పెంచారు. అలాగే, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్ దీవులు ఈ నెల 18న తన నివేదిక సమర్పించాల్సి ఉండగా, 23కు పెంచారు.
ఉత్తరప్రదేశ్ ఈ నెల 26న సర్ నివేదికను సబ్మిట్ చేయాల్సి ఉండగా, 31కు గడువు పొడిగించారు. ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నవదీప్ రిన్వా మాట్లాడుతూ.. సర్ ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేయడానికి, కచ్చితమైన ఓటర్ల జాబితాను నిర్ధారించడానికి మరో రెండు వారాల సమయం ఇవ్వాలని ఈసీని కోరామన్నారు. మరణించిన, వేరే చోటికి మారిపోయిన, సర్ ప్రక్రియకు గైర్హాజరైన ఓటర్ల వివరాలను జిల్లా ఎన్నికల అధికారులు ధ్రువీకరించేందుకు గాను ఈ పొడిగింపును కోరినట్లు వెల్లడించారు.
కాగా, డిసెంబర్ 26 వరకు సర్ ప్రక్రియ కొనసాగనుండగా, 31వ తేదీన ముసాయిదాను ప్రచురించనున్నారు. దీనిపై అభ్యంతరాలను వెల్లడించేందుకు డిసెంబర్ 31 నుంచి జనవరి 30 వరకు గడువు ఇచ్చారు. డిసెంబర్ 31 నుంచి 2026 ఫిబ్రవరి 21 వరకు అధికారులు అభ్యంతరాలను వెరిఫై చేయనున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ తుది సర్ జాబితాను ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నారు.

