ఆసిఫాబాద్, వెలుగు: గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీం 83వ వర్ధంతి వేడుకలను కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల ఆచారం మేరకు ఐదు గోత్రాలను సూచించే జెండాలను ఆవిష్కరించారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా, పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన ఆదివాసీలు పెద్దసంఖ్యలో పోరుగడ్డకు తరలివచ్చారు. వేలాది మంది ఆదివాసులు, భీం వారసులు, అధికారుల సమక్షంలో భీం మనుమడు కుమ్రం సోనేరావు దంపతులు భీం సమాధి వద్ద పూజలు చేశారు. గుస్సాడి నృత్యాలు, గిరిజన సంప్రదాయ వాయిద్యాలు, కుమ్రంభీం అమర్ రహే అన్న నినాదాలతో జోడేఘాట్ ప్రాంగణం మార్మోగింది. అలాగే భీం సహచరుడు కొమురం సూరు వర్ధంతిని సైతం నిర్వహించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్పర్సన్కోవ లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ కలెక్టర్లు రాహుల్ రాజ్, సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఎస్పీ సురేశ్‌కుమార్, మాజీ ఎంపీ గోడం నగేశ్, ఐటీడీఏ చైర్మన్లక్కెరావు తదితరులు కుమ్రంభీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
భద్రత కారణాలతో కేటీఆర్ పర్యటన రద్దు
కుమ్రంభీం వర్ధంతికి హాజరు కావాల్సిన మంత్రి కేటీఆర్ పర్యటన భద్రత కారణాలతో చివరి నిమిషంలో రద్దయింది. కెరమెరి అడవులు కేంద్రంగా నెల రోజులుగా మావోయిస్టులు కార్యకలాపాలను ముమ్మరం చేశారు. తిర్యాణి, జోడేఘాట్ అడవులను అంగుళం అంగుళం జల్లెడ పడుతున్న పోలీసులు కుమ్రంభీం వర్ధంతికి వెళ్లే మార్గంతో పాటు సభా ప్రాంగణాన్ని అధీనంలో తీసుకున్నారు. అయినప్పటికీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో సమస్యలు చెప్పుకొనేందుకు వచ్చిన ఆదివాసులు నిరాశకు గురయ్యారు.
గంటలో ముగిసిన దర్బార్
మంత్రి కేటీఆర్ పర్యటన రద్దు కావడంతో హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే కొనేరు కోనప్ప భీం వర్ధంతికి వచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గిరిజన దర్బార్ ను అధికారులు గంటలోపే ముగించారు. ఎంతో దూరం నుంచి సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వారి నుంచి అర్జీలు స్వీకరించకపోవడంతో ఆదివాసులు నిరాశకు గురయ్యారు.
