అడవుల్లో జాతరలు..రెండు నెలల పాటు వరుసగా ఆదివాసీల వేడుకలు

అడవుల్లో జాతరలు..రెండు నెలల పాటు వరుసగా ఆదివాసీల వేడుకలు
  • ప్రారంభమైన నాగోబా జాతర ప్రచార రథం
  • ఈనెల 30న గంగాజలానికి బయల్దేరనున్న మెస్రం వంశీయులు
  • వచ్చే నెలలో ఖందేవ్, జంగుబాయి, సదల్పూర్,  బుడుందేవ్, మహాదేవ్ జాతరలు 

ఆదిలాబాద్, వెలుగు: అడవుల జిల్లాలో వచ్చే రెండు నెలల పాటు జాతర్లే జాతరలు. ఆదివాసీల సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా జరుపుకొనే ప్రతి జాతరకు ఒక ప్రత్యేకత ఉంటుంది. పుష్యమాసం ప్రారంభం కావడంతో నాగోబా జాతరకు మెస్రం వంశీయులు సిద్ధమయ్యారు. ఈ మాసాన్ని ఆదివాసీలకు ఎంతో పవిత్రంగా భావిస్తారు. 

వందల ఏండ్ల చరిత్ర ఉన్న జాతర్లు, ప్రకృతినే పూజించే పండుగలు.. ఇలా ఆదివాసీల జాతర్లతో ఆదిలాబాద్​జిల్లాలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. ఈ జాతరల్లో తమ దేవతలకు పూజలు చేయడం, రోజుల తరబడి  నియమనిష్టలు, ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం, జాతర పరిసరాల్లో సేద తీరడం, దూరపు బంధువులను కలుసుకోవడం వంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంటాయి. 

వరుసగా జాతరలు

రెండు నెలల పాటు అడవుల్లో ఆదివాసీల జాతరలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కెరమెరి మండలం బీమల్‌పేన్‌, సిర్పూర్‌(యు) మండలంలో మహాదేవ్‌, నార్నూర్‌ మండలంలో ఖాందేవ్‌ జాతర, జంగుబాయి గుహల్లోని దేవుళ్లు, ఉట్నూర్‌ మండలం శ్యాంపూర్‌లో బుడుందేవ్‌ దేవతలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. పుష్యమాసం ప్రారంభం కావడంతో గిరిజనులు పొలిమేర పండుగలతో పాటు గ్రామ దేవతలైన పెర్సపేన్‌, భీమ్​ దేవరలకు కొలిచి జంగుబాయికి పూజలు చేస్తారు. 

బేల మండలంలోని సదల్ పూర్ జాతర, జైనథ్ మండలంలోని పూసాయి ఎల్లమ్మ, గంగజాతరలు సైతం వచ్చే నెలలో ప్రారంభం కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పాటు ఈ జాతర్లు జరగనుండగా వచ్చే వారంలో పండుగల తేదీలను కుల పెద్దలు వెల్లడించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి కూడా ఆదివాసీలు ఈ జాతరలకు హాజరై పూజలు చేస్తారు

మొదలైన నాగోబా జాతర సందడి

ఉమ్మడి జిల్లాలో పుష్యమాసంలో నాగోబా జాతరతో ఆదివాసీల జాతరలు ప్రారంభమవుతాయి. ఆదివాసీలు ముఖ్యంగా మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నాగోబా. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌ గ్రామంలో జరిగే నాగోబా జాతర రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరి 18న జాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే మెస్రం వంశీయులు జాతర ప్రచార రథాన్ని మంగళవారం ప్రారంభించారు. 

ఈ  ప్రచార రథం వారం రోజుల పాటు ఆదివాసీల గ్రామాల్లో ప్రచారం చేస్తుంది. ఈనెల 29న తిరిగి కేస్లాపూర్​కు చేరుకుంటుంది. అనంతరం మెస్రం వంశీయులు 30న పవిత్ర గంగాజల సేకరణకు జన్నారం మండలంలోని కలమడుగు గోదావరికి బయల్దేరనున్నారు. పలు మండలాలు, గ్రామాల మీదుగా కాలినడకన వెళ్తారు. తిరిగి నాగోబా చేరుకునేంత వరకు ప్రతి చోట వారికి ఆదివాసీలు అతిథ్యమిస్తారు.