- మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా పెనక వంశీయుల పూజలు
తాడ్వాయి, వెలుగు : మేడారంలో ఆదివారం పగిడిద్ద రాజుకు పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్పనుల్లో భాగంగా ఒకే వరుసలో గద్దెల ప్రతిష్ఠ చేస్తుండగా, మహబూబాబాద్జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు పూజారులైన పెనక వంశీయులు కుటుంబ సమేతంగా మేడారం తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులతో కలిసి పాల్గొన్నారు.
ఆడబిడ్డలతో సహా చేరుకొని వన దేవతలకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. కొత్తగా నిర్మించే పగిడిద్దరాజు గద్దెకు చేరుకొని సంప్రదాయం మేరకు కదిలించారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి పెనక రాజేశ్వరరావు మాట్లాడుతూ.. ఆదివాసీ పూజారుల నిర్ణయం మేరకు పగిడిద్దెరాజు గద్దె మీద గజ స్థంభం ప్రతిష్టిస్తున్నామన్నారు. తమ సంప్రదాయం ప్రకారం గద్దెను కదిలించగా.. అధికారుల సూచనలతో గజ స్తంభం ఏర్పాటు చేస్తామన్నారు.
పగిడిద్దరాజు పూజారులు పెనక సురేందర్, వెంకటయ్య, సమ్మయ్య, లక్ష్మీనరసు, రామస్వామి, పెనక వంశస్తులు, ఆడబిడ్డలు, సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య, సమ్మక్క దేవత పూజారులు చందా పరమయ్య, చందా గోపాలరావు, గోవిందరాజుల పూజారులు తదితరులు పాల్గొన్నారు.
