
- బడుల్లో మౌలిక వసతుల కల్పనలో ముందంజ
- ఆదిలాబాద్ జిల్లాలో 649 స్కూళ్లకు 645 స్కూళ్లలో పనులు పూర్తి
- 5 నెలల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన మహిళా సంఘాలు
ఆదిలాబాద్, వెలుగు: ఏదైనా పనులకు సంబంధించి కోట్ల రూపాయలు నిధులిచ్చినా.. కావాల్సినంత టైం ఇచ్చినా పూర్తి చేయడంలో అక్కడక్కడా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం చూపిస్తూనే ఉంటారు. కానీ, ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కాంట్రాక్టర్లు చేయలేని పనులను అమ్మ ఆదర్శ కమిటీలు అతి తక్కువ టైంలోనే చేసి చూపించాయి. కాంగ్రెస్ సర్కార్ బడుల బాగు కోసం ఏర్పాటు చేసిన అమ్మ ఆదర్శ కమిటీలు వారికి అప్పగించిన స్కూళ్ల అభివృద్ధి పనులను కేవలం ఐదు నెలల్లోనే పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నాయి.
వారు చేయలేనిది..వీరు చేసి చూపించారు
ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు- మనబడి పథకం కింద కింద గత బీఆర్ఎస్ సర్కార్ మౌలిక వసతులు కల్పించడానికి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 237 బడులను ఎంపిక చేసి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంట్రాక్టర్లకు నిధులు అందజేశారు. అయితే, వారు కేవలం 16 పాఠశాలల్లో మాత్రమే పనులు పూర్తి చేశారు. దీనికి కూడా రెండు సంవత్సరాలు తీసుకున్నారు.
అప్పట్లోనే జిల్లాలో 678 లోకల్ బాడీ, మేనేజ్మెంట్ స్కూల్స్ కు సంబంధించి పనులు అప్పగించగా, 16 పాఠశాలల్లో మాత్రమే పనులు కంప్లీట్ చేశారు. మరో మూడు స్కూల్స్అద్దె భవనాల్లో కొనసాగడం, 10 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్స్ ఉండడంతో పనులు చేయలేదు. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో గత మార్చి నెలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు ఏర్పాటు చేసింది. ఇందులో మహిళా సంఘాల సభ్యులు ఉంటారు. వీరికి జిల్లాలోని 649 స్కూళ్లలో 645 స్కూళ్ల పనులను అప్పగించగా ఐదునెలల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు.
రాష్ట్రంలోనే ముందంజలో ఆదిలాబాద్..
గతంలో బడుల్లో పనులు చేసేందుకు స్కూల్ మేనేజ్మెంట్కమిటీతో పాటు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించేవారు. వారి నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకోనితనంతో పనులు జరగక విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎస్ఎంసీ(స్కూల్మేనేజ్మెంట్కమిటీ)లను రద్దు చేసి వారి స్థానంలో అమ్మ ఆదర్శ కమిటీలు నియమించింది. ఈ కమిటీల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సమస్యలు తీర్చడం, మూత్రశాలలు, మరుగుదొడ్ల రిపేర్లు, విద్యుత్ సంబంధిత మరమ్మతులు పెయింటింగ్ వేయించడం, బెంచీల రిపేర్లు , గ్రీన్ చాక్ బోర్డు ఏర్పాటు, తరగతి గదుల తలుపులు, కిటికీలు బాగా లేకపోతే మార్చడం, ఫ్లోరింగ్ తదితర పనులు చేపట్టాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో జిల్లాలో 649 స్కూళ్లలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.23.24 కోట్లు మంజూరు చేసింది. ఇందులో 25 శాతం అంటే రూ.5.22 కోట్లు అడ్వాన్స్ కింద ఇవ్వగా, మార్చి 15 నుంచి మహిళా కమిటీలు పనులు ప్రారంభించాయి. గతంలో ‘మన ఊరు-మన బడి’ కింద కేవలం 10 శాతం మాత్రమే అడ్వాన్స్‌గా ఇచ్చారు. కానీ, ఇప్పుడు 25 శాతం నిధులు అడ్వాన్స్ గా ఇవ్వడంతో పాటు కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దీంతో ఐదు నెలల్లోనే 645 స్కూళ్లలో పనులు పూర్తి చేసి రాష్ట్రంలోనే ఆదిలాబాద్ జిల్లాను ముందంజలో నిలిపారు. ఇప్పటి వరకు చేసిన పనులకు రూ.7.58 కోట్ల బిల్లులు కూడా విడుదలయ్యాయి. కలెక్టర్ ద్వారానే ఈ నిధులు విడుదల చేస్తుండడంతో చేసిన పనులకు ఎక్కువ రోజులు బిల్లులు పెండింగ్‌లో ఉంచకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు.
బడుల్లో పారిశుధ్య పనులు వారికే...
బడుల్లో పారిశుధ్య పనులు సైతం అమ్మ కమిటీలకే అప్పగించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం స్కూళ్లలో స్కావెంజర్లు లేక అపరిశుభ్రత తాండవిస్తోంది. కొన్ని చోట్ల ఆయా స్కూళ్లలో టీచర్లు తాత్కాలికంగా కార్మికులతో పారిశుధ్య పనులు చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఈ బాధ్యతలు సైతం ఆదర్శ కమిటీలకు అప్పగిస్తే సమస్య తీరినట్టే. అదేవిధంగా త్వరలో పాఠశాలల్లో గృహజ్యోతి కింద ఉచిత కరెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కరెంట్ లేని స్కూళ్లలో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు మేలు జరిగే అవకాశం ఉంది.
వంద శాతం పనులు పూర్తి చేశాం
ఆదిలాబాద్ జిల్లాలో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా స్కూళ్లలో చేపట్టిన పనులు వంద శాతం పూర్తయ్యాయి. కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు రోజూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. నిధులు కూడా సకాలంలో రావడంతో పనులు చకచకా పూర్తి చేశారు. ఇప్పటి వరకు 645 స్కూళ్లలో పనులు కంప్లీట్అయ్యాయి.
టి. ప్రణిత, డీఈవో ఆదిలాబాద్