
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన భారత రాష్ట్ర సమితి నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు.. అసెంబ్లీని సమావేశపర్చండి ప్రజా సమస్యలపైన చర్చిస్తామని డిమాండ్ చేయాలి. కానీ, అసహనంతో సిగాలు ఊగిపోతున్నారు. ఏ వేదిక మీద అంటే ఆ వేదికపైన (చట్టసభలో తప్ప) ఎక్కడైనా ఎప్పుడైనా చర్చించడానికి మేం సిద్ధం అంటూ... మరక మంచిదే అన్నట్టు పొలిటికల్ పహిల్వాన్లులా బస్తీమే సవాల్ చేస్తుంటారు.
గత ప్రభుత్వంలో ఒక టర్మ్ నీళ్ల మంత్రిగా మరో దఫా ఆర్థికమంత్రిగా తెలంగాణకు అనన్యమైన సేవ చేసిన నాయకుడిని కొత్తకొండ వీరన్న పూనినట్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీద, అప్పుడప్పుడు హామీల మీద అశ్శరభ శరభా అంటూ ఒంటికాలు మీద లేస్తుంటాడు. పైగా ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ముఖ్యమంత్రికి పాలన చేతకావడం లేదంటారు. విరాసత్తో వచ్చిన పరిపాలన తమకు వెన్నతో పెట్టిన విద్య అని బావ ఒకవైపు, బామ్మర్ది మరోవైపు మద్దెల తాళాలు కొడుతూ బీరాలు పోతుంటారు.
ఇకపోతే జాగృతి కవిత తాము తమ కుటుంబం అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లలో ఎన్నడూ గుర్తుకురాని, కనీసం మాటవరసకు అనడానికి ఇచ్చగించని, పార్టీలో ప్రశ్నించని ఈమె సామాజిక ఉద్యమ నాయకురాలిగా కొత్తగా ఇటీవల అవతారం ఎత్తారు. తన కౌశలంతో ఒకసారి ధర్నాచౌక్లో మరోసారి చిట్ చాట్లో ఇంకోసారి ఢిల్లీలో, గల్లీలోను సామాజిక నాయకురాలిగా వక్కాణిస్తుంటారు. మాట్లాడేవారికి ఏమీలేకున్నా తెలంగాణలో వినేవారికి, చూసేవారికి భలేగా వినోదం పంచుతున్నారు.
జనాలు గమనిస్తున్నరు
ఇక ఫామ్ హౌస్లో ‘బంగారు తెలంగాణ’ దర్శక నిర్మాత, నటన, మాటలు పాటల రచయిత కేసీఆర్ సంకలనాలు, భాగాహారాలు అంకగణిత లెక్కలు తీస్తూ వేస్తుంటారు. దిన, వార, మాస, గోచార ఫలితాలను చూపించుకుంటుంటాడు. కవిత గాకుండా అదే మరో నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో ఆమెలా ప్రవర్తిస్తే ధిక్కారమును సైతునా అంటూ వెంటనే పార్టీలోంచి బహిష్కరించి అవతల ఎత్తేసేవాడు.
ఈ ఎపిసోడ్ విషయంలో కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును జనాలు గమనిస్తున్నారు. చతురతను అమాయకులైన తెలంగాణ ప్రజలు తమకు తెలిసిన జ్ఞాన చక్షువుల మేరకు అర్థం చేసుకుంటున్నారు. ఇకపోతే మరోవైపు సోషల్ మీడియాతో పాటు తమ చెప్పుచేతుల్లో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా ప్రభుత్వం తీరుమీద వార్తా కథనాలు దండిగా వండి వారుస్తూ రోజుకో తరీక విమర్శ పేరున దుమ్మెత్తి పోస్తున్నారు.
రాజకీయ రగడ
బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో ఎదురులేని అధికారాన్ని అనుభవించిన నాయకుల అవినీతి, అక్రమాలకు బాసటగా నిలిచిన కొందరు ఉన్నతాధికారులు అందినకాడికి దండుకున్నారు. నాయకులు మరోవైపు ఉన్నతాధికారులు ఒకరిని ఒకరు ఏమీ అనుకోకుండా పాలన సాగించారు. అందుకే ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమైన విభాగాలలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు సద్దితిన్న రేవును తలుస్తూ ప్రభుత్వం తీసుకోబోతున్న విధానపరమైన నిర్ణయాలను ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నాయకులకు అధికార సమాచారాన్ని చేరవేస్తున్నారు.
ఒకవిధంగా ఈ రాజకీయ రగడకు ప్రధాన కారణం అవుతున్నారు. విపక్ష నాయకులు మీడియా పాయింట్ల వద్ద ప్రెస్ క్లబ్లో ఎవరికి తోచిన ఆరోపణలు వారు చేసుకుంటున్నారు. అంతేకాకుండా కోర్టులలో కేసులు వేస్తున్నారు. దాదాపు ఇరువై నెలల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న కొమురెల్లి గుడి దగ్గర పట్నం పరచి మొక్కుకుంటున్నట్టు ప్రతిపక్ష నాయకుల అమావాస్య చంద్రుల పోకడలు రాజకీయ విశ్లేషకులకు దర్శనమిస్తున్నాయి.
విశ్వసనీయతపై నీలినీడలు
తెలంగాణ జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ ఇంటి తలుపులు బద్దలుగొట్టి బెదిరించిన తమరి ప్రజాస్వామ్య చరిత్ర ఇంకా ప్రజల మనో ఫలకంలో పచ్చిపచ్చిగా ఉన్నాయి. సోషల్ మీడియా స్వగతాలను, వార్తాపత్రికలను, ఎలక్ట్రానిక్ చానళ్లను చూసి వార్తా కథనాలను చదివి పాఠకులు, వీక్షకులు ఆయా వార్తల వెనక ఉన్న మరో అసలు విషయాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభ విశ్వాసంపై ప్రజల విశ్వసనీయత మీద నీలి నీడలు మరింత కమ్ముకుంటున్నాయి. ఇటువంటి వాతావరణం ఏర్పడడం ప్రజాస్వామ్య మనుగడకు అంత ఆరోగ్యకరమైన విషయం కాదు. కొందరిని కొన్నిసార్లు మోసం చేయవచ్చుగాని అందరినీ అన్నిసార్లూ మోసం చేయలేరు. అనే విషయాన్ని మన రాజకీయ నేతలు పీతల్లా ప్రజాక్షేత్రం అనే పంట పొలాలలో దొంగ బొరియలు చేయకుండా, ఇక ముందైనా తెలుసుకొని మసలుకుంటే వాళ్ల వాళ్ల రాజకీయారోగ్యానికి మరీ మంచిది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం తన అతి అసహనాలను అమావాస్యలుగా మార్చుకోకుంటే, అది వారికే మంచిది!
సామాజిక కులగణన
శాసనసభకు జరిగిన ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నీ తీర్చలేకపోయినా, అతి ముఖ్యమైనవి ఆర్థిక వనరుల మేరకు ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ, రైతు భరోసా, తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం, ఒకటో తారీకున ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు నెలనెలా క్రమం తప్పకుండా ఇస్తున్నారు.
గత ప్రభుత్వం ప్రజాధనంతో ఒకరోజులో తెలంగాణ వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసి ఆ కులాల వారీ సమాచారాన్ని తమ వద్దనే అట్టేపెట్టుకొన్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సామాజిక కులగణన చేసి బహిరంగంగా రిజర్వేషన్లను ప్రకటించారు. తీరా తమ దగ్గరికి వచ్చేసరికి ప్రజాస్వామ్యం జ్ఞాపకం రావడం పెద్ద విడ్డూరమేమి కాదు. వీరు విచారణకు హాజరైన ప్రతిసారి చేసే హడావుడి ఇంతా అంతా కాదు. గతంలో వీరు చేసిన నిర్వాకాలు తమ రక్షక భటులతో బెడ్ రూమ్ తలుపులు పగలగొట్టి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
- జూకంటి జగన్నాథం, కవి, రచయిత-