కలలోనైనా అనుకోలేదు

కలలోనైనా అనుకోలేదు

చాలాసార్లు అనుకున్నవి జరగవు. కానీ, అనుకోనివి ఎదురొస్తాయి. అలా ఎదురొచ్చినవాటిని మనవి అనుకుంటే, అవే కెరీర్​కి దారులు వేస్తాయి. అచ్చం అలానే ఐశ్వ‌‌ర్య లక్ష్మి డాక్టర్ అవ్వాలి అనుకుంది. కానీ, అనుకోకుండా యాక్టర్ అయింది. మణిరత్నంలాంటి డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్టులో ముఖ్యమైన పాత్ర చేసే స్థాయికి ఎదిగింది.

ఈ మధ్య విడులైన మ‌ణిర‌త్నం మూవీ ‘పొన్నియిన్ సెల్వన్-1’లో ప‌డ‌వ నడిపే వ్యక్తి కూతురు పూంగుళలి పాత్రలో న‌టించా. అమ్మాయిలు స్మార్ట్, స్ట్రాంగ్​గా ఉండాలి అనుకుంటా నేను. అచ్చం నేను అనుకున్నట్టే ఉంటుంది ఆ పాత్ర. ఆమె స‌ముద్రాలు దాట‌గ‌ల‌దు. అందుకు రెండు రాత్రులు ప‌డుతుందా? మూడు రాత్రులు ప‌డుతుందా? అనే ఆలోచనే త‌న మ‌న‌సులోకి రానీయదు. ఆ పాత్ర చేసే అవ‌కాశం ఇచ్చినందుకు మ‌ణిర‌త్నం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. మణి సర్ సినిమాలో ప్ర‌తి సీన్ ట‌ఫ్​గా ఉంటుంది. నేను, మ‌ణి స‌ర్ మాట్లాడుకున్న త‌ర్వాతే న‌టించేదాన్ని.

ఆ ప్రొడ‌క్షన్​తోనే...

మణి స‌ర్ ప్రొడ‌క్షన్ హౌజ్ ‘మ‌ద్రాస్ టాకీస్’ నుంచి 2019 మేలో అనుకుంటా ‘సర్​ని కలవండి’ అని ఫోన్​ కాల్​ వ‌చ్చింది.  అప్పటికే స‌ర్ ‘పొన్నియిన్ సెల్వన్’ మూవీ చేస్తున్నార‌నే వార్తలు వ‌చ్చాయి. క‌చ్చితంగా అందులో ఏదో ఒక రోల్ ఆఫ‌ర్ చేస్తార‌ని ఊహించా. సంవ‌త్సరంన్నర ప్రి–ప్రొడ‌క్షన్ వ‌ర్క్ త‌ర్వాత అంద‌రికంటే ముందుగా నా క్యారెక్టర్​కే ఆడిషన్​ చేశారు. సినిమాలో శోభిత ధూళిపాళ్ల చేసిన వ‌న‌తి క్యారెక్టర్​కి ఆడిష‌న్ ఇచ్చా. కానీ, ఆ న‌వ‌ల చ‌దువుతున్న‌ప్పుడు పూంగుళలి క్యారెక్టర్ న‌న్ను బాగా ఆకట్టుకుంది. నాకు ఆ రోల్ చేయాల‌నిపించింది. లండ‌న్​లో ‘జ‌గ‌మే తందిర‌మ్’ మూవీ షూటింగ్​లో ఉన్నప్పుడు నాకో ఫోన్​కాల్​ వ‌చ్చింది. నేనేం మాట్లాడ‌కముందే ‘గుడ్ న్యూస్..’ అని ఏదో చెప్పబోతుంటే మ‌ధ్యలోనే క‌ల్పించుకుని ‘‘మ‌ణి స‌ర్ నాకు పూంగుళలి రోల్ ఆఫ‌ర్ చేశారా?’’ అని అడిగా. ఆ రోల్ స్ట్రాంగ్​గా, మెచ్యూర్డ్​గా, కొంచెం ఓల్డర్​గా ఉండాల‌ని మ‌ణి స‌ర్ చెప్పారు. దానికోసం కండలు పెంచా. స్విమ్మింగ్ నేర్చుకున్నా. సెట్స్​లో నేను మ‌ణి స‌ర్​ని ఎడ‌తెరిపి లేకుండా క్వశ్చన్స్ అడుగుతుంటే.. కార్తీ నా చెయ్యి ప‌ట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్లేవారు. ఎందుకంటే, మ‌ణి స‌ర్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో సెట్​లో కేవ‌లం కార్తీకే తెలుసు. కార్తీ ‘ఇప్పుడు వ‌ద్దు’ అని చెప్తే వెళ్లేదాన్ని కాదు. 

ఎప్పుడూ అనుకోలేదు

అసలు నేను యాక్టర్ అవుతాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. మా పేరెంట్స్ నన్ను డాక్టర్ చేయాలి అనుకున్నారు. నేను కూడా డాక్టర్  అవుదామ‌నుకునేదాన్ని. కట్ చేస్తే ఇప్పుడు మ‌ణి స‌ర్ డ్రీమ్ ప్రాజెక్ట్​లో  భాగమయ్యానంటే అది నా ఊహ‌కు కూడా అందట్లేదు. దేవుడు నాకోసం ముందుగానే అన్నీ రాసిపెట్టాడేమో అనిపిస్తుంది!  కేర‌ళ‌లోని త్రివేండ్రంలో 1990లో పుట్టా. హోలీ ఏంజిల్స్ కాన్వెంట్ త్రివేండ్రం స్కూల్​లో చ‌దువుకున్నా. హైస్కూల్ చదువు మాత్రం త్రిసూర్​లో ఉన్న స్కేర్డ్ హార్ట్స్ గ‌ర్ల్స్ హయ్యర్ సెకండ‌రీ స్కూల్​లో పూర్తి చేశా. 2017లో ఎర్నాకుళం​లో ఉన్న ‘శ్రీ నారాయ‌ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్’ నుంచి ఎంబీఏ కంప్లీట్ చేశా. నేను సినిమాల్లోకి వెళ్లడం మా పేరెంట్స్​కి ఇష్టం లేదు. కానీ, చివ‌రికి ఒప్పుకున్నారు. నా యాక్టింగ్ కెరీర్ గురించి వాళ్లు అంత‌ ఎంకరేజింగ్​గా ఉండరు. కానీ, మా నాన్న ఇప్పుడిప్పుడే నా కెరీర్ ప‌ట్ల కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మా అమ్మకు సినిమాలు చూడ‌టం ఇష్టమే అయినా, త‌న కూతురు న‌టించిన సినిమాలు చూడ‌టానికి మాత్రం ఇష్టప‌డ‌దు! ఇప్పుడు వాళ్లు ఇద్దరూ సంతోషంగానే ఉన్నారు. కానీ, నేను ఎక్కువ‌గా ఇంట్లో ఉండ‌క‌పోవ‌డ‌ం వాళ్ల‌కు ఉన్న పెద్ద స‌మ‌స్య‌. నా కెరీర్ ని ఎంత ప్రేమిస్తున్నానో చెప్తూ ఈ విషయాన్ని డిఫెండ్ చేస్తుంటా. చాలా మంది తమ జాబ్స్​ని మెకానిక‌ల్​గా చేస్తుంటారు. కానీ, నాకు అలాంటి స‌మ‌స్యలేం లేవు. నేను  రాత్రి వ‌ర‌కు షూటింగ్​లో ఉన్నా, పొద్దున్నే లేచి అదే ఎన‌ర్జీతో లొకేష‌న్​కి వెళ్లి యాక్టింగ్ చెయ్యగ‌ల‌ను. మా పేరెంట్స్​కు కూడా ఈ విష‌యం తెలుసు. 

ట్రైన్డ్ యాక్టర్ కాదు

యాక్టింగ్​లో నేను ఎటువంటి ట్రైనింగ్​ తీసుకోలేదు. మలయాళంలో ‘మాయాన‌ది’  మూవీ న‌న్ను మంచి యాక్టర్​గా మ‌లిచింది. ‘మాయాన‌ది’ త‌ర్వాత నా కెరీర్ స్పీడ్ పెరిగింది. నిజానికి నా కెరీర్​లో ఇలాంటి మ‌లుపు వ‌స్తుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేదు. నేను ఎదిగిన క్రమాన్ని చూసుకుంటే సంతోషం క‌లుగుతుంది. ‘మాయాన‌ది’లో చేసిన అప్పు క్యారెక్టర్ వ‌ల్ల నాకు ఇంత ప్రేమ‌, గుర్తింపు ల‌భించింది. అది నా కెరీర్ ట‌ర్నింగ్ పాయింట్. సోష‌ల్ మీడియాలో ఒక పోస్ట్, ఒక రీల్... ఏదో ఒకలా నాకు రోజూ ‘మాయాన‌ది’ని గుర్తుకు తెస్తుంటాయి. ఆ సినిమా వచ్చి నాలుగైదేండ్లు అయినా అంద‌రి మ‌న‌సుల్లో చెరిగిపోలేదంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఒక కథ ప్రేక్షకుల‌ను ఎంత‌లా ప్రభావితం చేస్తుందో మాయాన‌ది మూవీ ప్రూవ్ చేసింది. నా డైలాగ్స్, క్యారెక్టర్ ఇప్పటికీ మీమ్స్ లో స‌ర్క్యులేట్ అవుతుంటాయి. ‘మాయాన‌ది’ చూశాకే మణి సర్ నన్ను పొన్నియిన్ సెల్వన్ ఆడిషన్​కి పిలిచారు.

మోడలింగ్ నుంచి

మోడ‌లింగ్ 2014లో మొద‌లుపెట్టా. ‘ఫ్లవ‌ర్ వ‌ర్డ్, సాల్ట్ స్టూడియో, వ‌నిత, ఎఫ్​డ‌బ్ల్యూ’ వంటి మ్యాగ‌జైన్స్ క‌వ‌ర్ పేజీల్లో నా ఫొటో ప‌బ్లిష్ అయింది.  కొన్ని జువెల‌రీ బ్రాండ్స్​కి, క్లాత్ బ్రాండ్స్​కి మోడ‌లింగ్ చేశా.  మోడ‌లింగ్ చేస్తున్నప్పటికీ, యాక్టింగ్ గురించి ఎప్పుడూ ప్లాన్ చేయలేదు.  చ‌దువుకుంటూనే, ఛాన్స్ వ‌చ్చిన‌ప్పుడే యాక్టింగ్ చేద్దాం అనుకున్నా. ఇంత‌లో ‘ఎన్​జాందుక‌లుడే న‌ట్టి ఒరిడ‌వెళ’ అనే ఫ్యామిలీ డ్రామాలో న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. అందులో మంచి రోల్ చేశా. ఆ త‌ర్వాత రొమాంటిక్ థ్రిల్లర్ ‘మాయాన‌ది’ ఫీమేల్ లీడ్ రోల్ చేసే అవ‌కాశం వ‌చ్చింది. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయింది. ఫహ‌ద్ ఫాజిల్​తో కలిసి 2018లో ‘వ‌ర‌త‌న్’ మూవీ’లో చేశా.  ఆ త‌ర్వాత ఏడాది వ‌ర‌సగా ‘విజ‌య్ సూపరియమ్​ పౌర్ణమీయ‌మ్’, ‘అర్జెంటీనా ఫ్యాన్స్ కట్టార్కడవు’, ‘బ్రద‌ర్స్ డే’ వంటి సూప‌ర్ హిట్ మ‌లయాళం మూవీస్​లో న‌టించా. 2019లో ‘యాక్షన్’ మూవీతో త‌మిళ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యా. ఆ త‌ర్వాత 2021లో త‌మిళంలోనే ధనుష్ హీరోగా వచ్చిన గ్యాంగ్ స్టర్ మూవీ ‘జ‌గ‌మే తందిర‌మ్’ మూవీ చేశా. నెట్​ఫ్లిక్స్​లో విడుద‌లైన ఈ మూవీ సూప‌ర్ హిట్ అయింది.

విమ‌ర్శను స్వీక‌రిస్తా

ఈ ఏడాది జూలైలో విడుదలైన త‌మిళ్ మూవీ ‘గార్గి’లో నేను చేసిన అహ‌ల్య పాత్ర నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే, ఈ సినిమాలో నటించిన దానికంటే కూడా ఎక్కువ ప్రొడ్యూస‌ర్​గా చేయ‌డం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాస్ట్ పర్ఫార్మెన్స్, స్క్రిప్ట్, డైరెక్షన్, ప్రొడ‌క్షన్ ఇలా అన్ని విభాగాలను అంద‌రూ మెచ్చుకోవ‌డం ఎప్పటికీ మ‌ర్చిపోలేను. ‘గార్గి’ క్లైమాక్స్ లో నా న‌ట‌న‌ను చాలామంది విమ‌ర్శించారు. నిజానికి నేను విమ‌ర్శకు చాలా విలువిస్తా. మ‌నుషులు ఎంత రూడ్​గా ఉన్నా, విద్వేషంతో ప్రవ‌ర్తించినా స‌రే! నేను ఏదైనా విలువైన‌ద‌ని భావిస్తే దాని ప్రభావం నాపై కచ్చితంగా ఉంటుంది. ‘‘కామెంట్స్ చ‌ద‌వ‌డం ఆపెయ్. ఈజీగా తీస్కో’’ అని చెప్పినా స‌రే... వాటిని చ‌ద‌వ‌కుండా ఉండలేను. నాకు ఊహించ‌నంత ప్రేమ ల‌భిస్తున్నప్పుడు ఆ దారిలో వ‌చ్చే విమ‌ర్శకు కూడా నేను రెడీగా ఉండాలి క‌దా?  గార్గి సినిమాలో త‌మిళ‌నాడులో ఉండే మ‌లయాళీ జ‌ర్నలిస్టు పాత్ర చేశా. ఆ యాస కోసం చాలా ట్రై చేశా. కానీ, అది అనుకున్నట్టుగా రాలేదు. నేను ఇప్పటికీ త‌మిళం నేర్చుకుంటున్నా.

నెక్స్ట్​ మూవీస్​ 

ఇప్పుడు నా చేతిలో చాలా మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. మ‌లయాళంలో ‘కుమారి’ మూవీ చేస్తున్నా. తెలుగులో చేసిన ‘అమ్ము’ మూవీ రిలీజ్​కి రెడీగా ఉంది. మ‌లయాళంలో ఉన్నిక్రిష్ణన్ తీస్తున్న ‘క్రిస్టొఫ‌ర్’ మూవీలో చేస్తున్నా. ఇందులో నా రోల్ చిన్నది. కానీ, మ‌మ్ముట్టితో క‌లిసి ప‌నిచేయాల‌నే నా క‌ల‌ను నిజం చేసుకోవ‌డానికి ఈ సినిమా ఒప్పుకున్నా. దుల్కర్ స‌ల్మాన్​తో  క‌లిసి చేస్తున్న‘కింగ్ ఆఫ్ కొతా’ షూటింగ్​కి త్వర‌లో వెళ్తున్నా. 

అప్​డేట్​ అవుతుంటా..

షూటింగ్​కి ముందు స్క్రిప్ట్ మొత్తం చ‌దవ‌డానికి ప్రయ‌త్నిస్తా. డైరెక్టర్​కి మాత్రమే ఆ క్యారెక్టర్ గురించి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి, డైరెక్టర్​తో ఎక్కువ‌సేపు మాట్లాడి అన్ని విష‌యాలు లోతుగా తెలుసుకుంటా. అప్పుడు నా జాబ్ ఈజీ అయిపోతుంది. తెలుగులో ‘అమ్ము’ సినిమా డైరెక్టర్ చారుకేష్ తో షూటింగ్​కి ముందు మాట్లాడే అవ‌కాశం రాలేదు. ఈ సినిమా గృహహింస అనే థీమ్​ మీద నడుస్తుంది. గృహహింస నుంచి బ‌య‌ట‌ప‌డిన కొందరితో మాట్లాడి ఆ రోల్ కోసం ప్రిపేర్ అయ్యా. సెట్స్​కి వెళ్లాక చారుకేష్ తో మాట్లాడా. నా ప్రతి సీన్​లో నా క్యారెక్టర్​కి ఇంకొన్ని లేయ‌ర్స్ యాడ్ చేయ‌డం మొద‌లుపెట్టారు ఆయ‌న. అది నాకు చాలా ఉప‌యోగ‌ప‌డింది. మ‌ణి స‌ర్ గురించి అందరికీ తెలిసిందే. ఆయ‌న ప్రతి సీన్ ని ఓపెన్ మైండ్​తో చూస్తారు. అలాగే నేను చేసిన ‘అర్చన 31 నాట్ అవుట్’ మూవీ డైరెక్టర్ అఖిల్ వ‌య‌సు పాతికేండ్లే అయినా, 40 ఏండ్లు పైబడిన వ్యక్తికి ఉన్నంత మెచ్యూరిటీ ఉంది. ఒక్కో డైరెక్టర్​ నుంచి ఒక కొత్త విష‌యం నేర్చుకుంటున్నా.

‘నో’ చెప్పేస్తా

ఒక క్యారెక్టర్​కి న్యాయం చేయలేను అనిపిస్తే వెంట‌నే ‘నో’ చెప్తా. ఎమోష‌న్​ ఎక్కువగా ఉన్న క్యారెక్టర్స్​కి దూరంగా ఉంటా. నా ‘వర‌త‌న్’ మూవీ క్యారెక్టర్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి రెండు వారాలు ప‌ట్టింది. అది క‌ష్టంగా అనిపించింది. ముందు సినిమాలో చేసిన క్యారెక్టర్​ ఛాయ తరువాత చేస్తున్న సినిమాలో రోల్​ మీద పడకుండా సెట్స్​ మీదకి బ్లాంక్ ఫేజ్​లో వెళ్లాల‌ని కోరుకుంటా. 
- గుణ