కన్నీళ్లతో పుట్టి..... కన్నీటితోనే కన్నుమూసింది

కన్నీళ్లతో పుట్టి..... కన్నీటితోనే కన్నుమూసింది

హీరోయిన్లు సినిమాల్లో చాలాసార్లు కన్నీళ్లు పెడుతుంటారు. కానీ తమ నటనతో అవతలివాళ్ల కళ్లలో నీళ్లు తెప్పించేవాళ్లు కొందరే ఉంటారు. ఆ విషయంలో మీనా కుమారిని మించినవాళ్లు లేరనే చెప్పవచ్చు. ఆమె చేసినవన్నీ గుండెల్ని బరువెక్కించే కథలే. కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడే పాత్రలే. అయినా తన కెరీర్‌‌లో ఒక్కసారి కూడా గ్లిజరిన్ వాడలేదామె. కెమెరా ముందు నిలబడగానే కళ్ల నుంచి నీళ్లు అలవోకగా జాలువారేవి. అది చూసి ప్రతి ప్రేక్షకుడి కళ్లూ చెమ్మగిల్లేవి. అంత అద్భుతంగా నటించేది. అందుకే ఆమెకి ‘బాలీవుడ్ ట్రాజెడీ క్వీన్’ అనే పేరు వచ్చింది. అయితే చాలామందికి తెలియనిదేమిటంటే. ఆమె జీవితమే ఓ పెద్ద ట్రాజెడీ. కన్నీళ్లతోనే పుట్టింది. కన్నీళ్లతోనే బతికింది. కన్నీటితోనే కన్నుమూసింది. ఇప్పటికీ ఆమె కథ వింటే ప్రతి గుండె రెపరెపలాడుతుంది. అయ్యో పాపం అంటూ ప్రతి మనసూ నిట్టూరుస్తుంది.

డబ్బు కోసం చిన్నప్పుడే ముఖానికి మేకప్..

ఈ లోకంలో మీనా కుమారి జీవించింది కేవలం ముప్ఫై ఎనిమిదేళ్లు. అందులో ముప్ఫై మూడేళ్ల పాటు నటిస్తూనే ఉందామె. తన అసలు పేరు మజబీన్‌ బేగమ్. 1933లో పాకిస్థాన్ నుంచి ఇండియా వచ్చి సెటిలైన ముస్లిమ్ కుటుంబంలో జన్మించింది. తండ్రి నటుడు, కవి, సంగీతకారుడు. తల్లి స్టేజ్ ఆర్టిస్ట్. ఇద్దరి సంపాదన అంతంతమాత్రం. అందుకే వారిది కడు పేద కుటుంబం. మీనా పుట్టినప్పుడు డాక్టర్‌‌కి ఇవ్వడానికి డబ్బులు లేక హాస్పిటల్ మెట్లమీదే వదిలేసి వెళ్లిపోయాడు తండ్రి. కొన్ని గంటల తర్వాత మనసు మార్చుకుని వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. అలా కష్టాల మధ్య పుట్టిన మీనా.. ఆ కష్టాలతోటే పెరిగింది. డబ్బు కోసం చిన్నప్పుడే ముఖానికి మేకప్ వేసుకుంది. మొదటి సినిమాకి ఆమెకి పాతిక రూపాయల రెమ్యునరేషన్ దక్కింది. అది అప్పట్లో వారికి పెద్ద మొత్తమే. నాటి నుంచి నటిగా కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది. 

చదువుకోవాలని మనసులో ఉన్నా కుటుంబ భారమంతా ఆ నాలుగేళ్ల చిన్నారి పైనే పడింది. లెదర్ ఫేస్, అధూరీ కహానీ, పూజ, ఏక్‌హీ భూల్‌, కసౌటీ, గరీబ్ లాంటి చిత్రాల్లో బేబీ మీనాగా మెప్పించడంతో.. కాస్త పెద్దవ్వగానే హీరోయిన్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. దాంతో బేబి మీనా నుంచి మీనాకుమారిగా మారింది. కానీ తర్వాతి సంవత్సరమే తల్లి చనిపోవడంతో మానసికంగా కుమిలిపోయింది మీనా. ఒక్కసారిగా ఒంటరిదైపోయినట్టు ఫీలయ్యింది. అయినా బాధను మనసులోనే దాచుకుని నటనపై దృష్టి పెట్టింది. ఓ వైపు నటిస్తూ, మరోవైపు పాటలు పాడుతూ ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. 

తిరుగులేని నటిగా... 

ఊహ తెలిసిననాటి నుంచీ వ్యక్తిగత జీవితం నిండా నిరాశ ఉండటం వల్లనో ఏమో.. తెరమీద విషాదాన్ని అద్భుతంగా పండించేది మీనాకుమారి. ఎలాంటి బరువైన పాత్రనైనా అత్యంత తేలికగా పోషించేసేది. కోహినూర్, దిల్ ఏక్ మందిర్, చిరాగ్ కహా రోష్నీ కహా, ఫూల్ ఔర్ పత్థర్, ఆజాద్, మిస్ మేరీ, శారద, ఫుట్‌పాత్, పరాయీ, ఆర్తీ, పరిణీత, శారద, సహారా, బహానా, భాభీ కీ చూడియా, ఖ్వాబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గొప్ప సినిమాలో. ఎంత చక్కని పాత్రలో. ఇక ‘పాకీజా’ మూవీలో మీనా నటన అద్భుతం, అజరామరం. కన్ను మూసి తెరిచేలోగా తిరుగులేని నటి అయిపోయింది. స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో చక్రం తిప్పింది. కానీ ఓ ఆడపిల్లగా ఆలోచించకుండా వేసిన ఒక తప్పటడుగు.. ఆమె జీవితాన్నే అతలాకుతలం చేసేసింది. 
    
సినిమాకు బ్రేక్ పడినా.. వారి బంధానికి మాత్రం పడలేదు...

చిన్నతనంలో ‘జైలర్’ అనే మూవీలో యాక్ట్ చేసింది మీనా. అప్పుడే మొదటిసారి ఫిల్మ్ మేకర్ కమల్ ఆమ్రోహీని కలిసింది. హీరోయిన్ అయ్యాక  ‘తమాషా’ మూవీ సెట్‌లో మరోసారి ఆయన్ని కలిసింది. నిజానికి అతను తనకి గుర్తు లేడు. కానీ హీరో అశోక్‌ కుమార్ పరిచయం చేయడంతో చిన్నప్పుడు తన సినిమాలో నటించిన సంగతి గుర్తొచ్చింది. ఆ తర్వాత ఆమెతో ‘అనార్కలి’ అనే మూవీని ప్లాన్ చేశాడు కమల్. అయితే ప్రాజెక్ట్ పట్టాలెక్కేలోపే మీనాకి మేజర్ యాక్సిడెంట్ అయ్యింది. నాలుగు నెలల పాటు హాస్పిటల్‌లో నరకం చూసింది. ఆ సమయంలో కమల్ తరచూ వచ్చి మీనాని చూసేవాడు. ధైర్యం చెప్పేవాడు. దాంతో చనువు ఏర్పడింది. హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇద్దరూ గంటల పాటు ఫోన్‌లో మాట్లాడుకునేవారు. అనుకోని కారణాలతో ‘అనార్కలి’ సినిమాకి బ్రేక్ పడినా.. వీరి బంధానికి మాత్రం బ్రేక్ పడలేదు. అప్పటికే పెళ్లయ్యి ముగ్గురు పిల్లలున్నారని తెలిసినా కమల్ ప్రేమలో మునిగిపోయింది మీనా. అతడూ ఆమెని వదులుకోడానికి ఇష్టపడలేదు. దాంతో ఒక వేలెంటైన్స్ డే నాడు ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత మౌనంగా ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. 

కానీ దాచేస్తే దాగేది కాదు నిజం. అందుకే విషయం బైటపడిపోయింది. వెంటనే మీడియా రకరకాల కథనాలు రాసేసింది. అవి చూసి మీనా తండ్రి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. పద్దెనిమిదేళ్ల వయసులో ముప్ఫై నాలుగేళ్ల వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా అంటూ కేకలేశాడు. కూతురి మనసు మార్చాలని ట్రై చేశాడు. కానీ మీనా వినలేదు. ఈ జన్మకి అతనే తన భర్త అంది. అతని కొత్త సినిమాలో నటించడానికి సైతం రెడీ అయ్యింది. వీల్లేదని తండ్రి అడ్డుపడటంతో పుట్టింటిని వదిలి భర్త దగ్గరకు వెళ్లిపోయింది. ఇక తన కష్టాలు తీరిపోతాయని, ఇన్నాళ్లకి తన జీవితంలోకి ఆనందం వచ్చిందని అనుకుంది మీనా. కానీ ఒక కష్టం నుంచి అంతకంటే పెద్ద కష్టంలోకి వెళ్తున్నానని తెలుసుకోలేకపోయింది. పెళ్లయిన తర్వాత కూడా నటించడానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి.. ఆమెని అనుమానించడం మొదలుపెట్టాడు కమల్. షూటింగ్ స్పాట్స్ కి వచ్చేసేవాడు. మనుషుల్ని నియమించి ఎప్పటికప్పుడు ఆమెపై నిఘా పెట్టేవాడు. వాళ్లు మీనా మేకప్‌ రూమ్‌లోకి సైతం వచ్చేసేవారు. 

ఇదంతా ఆమె మౌనంగా భరించేది. శారీరకంగాను, మానసికంగాను అతను ఎంతో హింసిస్తున్నా.. కనురెప్పలు దాటి బైటికి రాకుండా కన్నీళ్లను ఆపేసుకునేది. కార్ యాక్సిడెంట్‌లో ఎడమచేతి మీద పడిన మచ్చను చీర కొంగుతోనో దుపట్టాతోనో కవర్‌‌ చేసేసి కెమెరా ముందుకి వచ్చే ఆమె.. భర్త కారణంగా అనుభవిస్తున్న వేదనను కూడా గుండెల్లోనే దాచేసుకుని నవ్వుతూ అందరి ముందూ తిరిగేది. చివరికి ఓరోజు ఆమె ఓపిక నశించింది. కమల్ అసిస్టెంట్‌ ఒకరు వచ్చి.. షూటింగ్‌ ఆపేసి ఇంటికి వచ్చేయమన్నారంటూ బలవంతపెట్టడంతో మీనాలో కోపం కట్టలు తెంచుకుంది. వచ్చేది లేదని తెగేసి చెప్పింది. షూటింగ్ అయ్యాక చెల్లెలి ఇంటికి వెళ్లిపోయింది. అంతే.. ఇక మళ్లీ జీవితంలో కమల్‌ దగ్గరికి వెళ్లలేదామె.

 

మీనాకి నిద్రలేమి సమస్య తీవ్రంగా ఉండేది. నిద్రమాత్రలు వాడటం మంచిది కాదని రోజూ ఒక పెగ్ బ్రాందీ తాగమన్నాడు డాక్టర్. మొదట్లో దాన్ని నిద్రలేమికి మందులా తీసుకున్న మీనా.. కమల్‌తో విడిపోయాక తన బాధల్ని మరపించే మందుగా భావించింది. విపరీతంగా తాగడం మొదలుపెట్టింది. ఫలితంగా లివర్‌‌ దెబ్బ తింది. తీవ్రమైన ఇబ్బందులు రావడంతో లండన్, స్విట్జర్లాండ్ దేశాలకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంది. తిరిగొచ్చి బాంద్రాలో ఒక ఫ్లాట్ కొనుక్కుంది. కెరీర్‌‌పై తిరిగి దృష్టి పెట్టింది. అప్పటికే చాలా వీక్ అయ్యింది. అయినా మనసు పెట్టి నటించేది. తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ ‘పాకీజా’ అప్పుడే చేసింది. అయితే 1972లో ఆ సినిమా రిలీజైన కొద్ది రోజులకే లివర్ సిర్రోసిస్‌ తిరగబెట్టింది. పరిస్థితి విషమించడంతో మూడు రోజుల పాటు ఆస్పత్రిలో పోరాడాక మృత్యుదేవత ముందు తన ఓటమిని అంగీకరించింది మీనా.  

బాలీవుడ్ ట్రాజెడీక్వీన్‌

మద్యం తాగి కాదు.. తన కన్నీటిని తాగి తాగి ఇక ఓపిక లేక చనిపోయింది అంటూ మీనా సన్నిహితులు ఆవేదన చెందారు. ఆమె కోరిక ప్రకారం సమాధి మీద ఇలా రాశారు.. ‘జరిగిన మోసం.. ఆగిన గీతం.. విరిగిన హృదయంతో ఆమె తన జీవితాన్ని అంతం చేసుకుంది.. పశ్చాత్తాపంతో మాత్రం కాదు’. అవును.. కమల్‌ని పెళ్లి చేసుకున్నందుకు ఆమె ఎప్పుడూ పశ్చాత్తాపడలేదు. అందుకే అతను చనిపోతే తన సమాధి పక్కనే అతనినీ సమాధి చేయమని కోరి చనిపోయింది. కానీ అతను చేసిన ద్రోహం ఆమె మనసును విరిచేసింది. ఆ బాధ ఆమెని నిలువునా కుంగదీసింది. గుల్జార్, ధర్మేంద్ర, సావన్ కుమార్‌‌ లాంటి వారి సాంగత్యంలో ప్రేమను వెతుక్కుందని కొందరు అంటారు. కానీ ముక్కలైన ఆమె మనసు తిరిగి అతుక్కున్న దాఖలాలే లేవు. లేదంటే ఆమె అంత త్వరగా తనువు చాలించేది కాదు. తెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ ట్రాజెడీ క్వీన్‌గా మిగిలిపోయేది కాదు. తన పుట్టినరోజైన ఇవాళ కూడా.. తన జీవితంలోని విషాదాన్నే గుర్తు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఆమె అభిమానులకు వచ్చేది కాదు.