గంజాయి వేటలో జగిత్యాల పోలీసులు .. రాష్ట్ర, జిల్లాల సరిహద్దులపై ప్రత్యేక నిఘా  

గంజాయి వేటలో జగిత్యాల పోలీసులు .. రాష్ట్ర, జిల్లాల సరిహద్దులపై ప్రత్యేక నిఘా  
  • ఎస్పీ ఆదేశాలతో  విస్తృతంగా తనిఖీలు చేస్తున్న స్పెషల్ టీమ్స్‌ 
  • కిలోల కొద్దీ గంజాయి స్వాధీనం.. 10 మందిపై కేసులు నమోదు
  • ఇతర జిల్లాల నుంచి గంజాయి సప్లైని కట్టడి చేస్తున్న పోలీసులు  
  • మైనర్లకు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరిక

కరీంనగర్/జగిత్యాల, వెలుగు : మైనర్‌‌కు గంజాయి అలవాటు చేసి, అత్యాచారానికి పాల్పడిన ఘటనను జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్ గా తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు.. గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో నిర్మూలించడంపై దృష్టి పెట్టారు. జగిత్యాల జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన స్పెషల్ టీమ్‌లు రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో ముమ్మంగా తనిఖీలు చేపడుతున్నాయి. కిలోలకొద్దీ గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు రవాణా చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేస్తున్నాయి. 

ఆరు కేసుల్లో 10 మంది అరెస్ట్‌.. 

ఈ నెల 23న రాయికల్ మండలం ఇటిక్యాల రోడ్డులో ఇద్దరు వ్యక్తులు ఆరు కిలోల గంజాయి తీసుకెళ్తూ పోలీసులకు చిక్కారు. అదే రోజు మల్లాపూర్ పోలీసులు రేగుంట గొర్రెపల్లి వద్ద అటవీ ప్రాంతంలో టూ వీలర్ పై తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని పట్టుకుని ఒకరిపై కేసు నమోదు చేశారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామంలో మైదం అజయ్ వద్ద 260 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ నెల 28న రాయికల్ మండలం కుమ్మరిపల్లి స్టేజీ వద్ద జగిత్యాల నుంచి రాయికల్‌కు గంజాయి సరఫరా చేస్తున్న కొండూరి రాజేశ్, అర్ముల్ల సాయి కుమార్‌‌ను అరెస్ట్ చేసి కేసు ఫైల్ చేశారు.

వీరి నుంచి 1.5 కిలోల ఎండు గంజాయి,  మూడు సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల ఎంక్వైరీలో వీరు మైనర్లకు గంజాయి అలవాటు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే అదేరోజు పెగడపల్లి మండల కేంద్రంలో గంజాయి తరలిస్తున్న వంశీ కృష్ణ అనే యువకుడితో పాటు మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆదిలాబాద్ నుంచి ఇంద్రవెల్లిలో ఓ వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు గుర్తించారు.  

స్పెషల్ టీమ్‌ల ఏర్పాటు.. 

 గంజాయి, మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు ఎస్పీ స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.  రంగంలోకి దిగిన ఈ టీమ్‌లు గంజాయి తాగుతున్న వారితో పాటు రవాణా చేస్తున్న వ్యక్తుల కోసం వేట కొనసాగిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడా గంజాయి సాగు కానప్పటికీ.. ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ ఫారెస్టును ఆనుకుని ఉన్న గ్రామాలతో పాటు ఏపీలోని విశాఖపట్నం, సీలేరు తోపాటు చత్తీస్ గఢ్ రాష్ట్రం నుంచి సప్లై అవుతున్నట్లు నిర్ధారణకు వచ్చారు. గంజాయి సప్లై చేస్తూ ఇటీవల పోలీసులకు చిక్కిన స్మగ్లర్లు ఇదే విషయం వెల్లడించినట్లు తెలిసింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి గంజాయి రవాణా కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 

గంజాయి సప్లై చేస్తే  పీడీ యాక్ట్ పెడ్తం

ఇటీవల జరిగిన సంఘటన నేపథ్యంలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నాం. జిల్లాకు ఏయే ప్రాంతాల నుంచి గంజాయి సరఫరా అవుతుందో గుర్తించి  జిల్లా సరిహద్దుల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. గంజాయికి యువత, మైనర్లు ఎవరూ బానిసలై జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఇటివల వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు బాధ కలిగించాయి.

జగిత్యాల నుంచి మైనర్లు హైదరాబాద్ లాంటి సిటీలకు వెళ్లి రేవ్ పార్టీల్లో పాల్గొన్నారనేందుకు ఎలాంటి ఆధారాల్లేవు. ఈ కేసులో  బాలికకు గంజాయి అలవాటు చేసి అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని గుర్తించి అరెస్టు చేసి జైలుకు పంపాం. మైనర్ల విషయం లో మీడియా కూడా సంయమనం పాటించాలి. జిల్లాలో తనిఖీలను మరింత ముమ్మరం చేసి గంజాయి అనవాళ్లు లేకుండా చేస్తాం. స్టూడెంట్స్ గంజాయి, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా అవగాహన కల్పించాలి.

 సన్ ప్రీత్ సింగ్, ఎస్పీ, జగిత్యాల

గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

మల్లాపూర్ , వెలుగు: గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు మల్లాపూర్ పీఎస్‌లో మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు.  జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులపూర్ గ్రామంలోని చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం పోలీసులు ఎస్సై కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాంపల్లి రమేశ్వర్(40), మరో మైనర్ బాలుడు నిర్మల్ జిల్లా  ఖానాపూర్ నుంచి బైక్‌పై ఓబులపూర్ గ్రామం వైపు వస్తున్నారు.

వీరిద్దరూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా..ఎస్సై కిరణ్ కుమార్, సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. వారిని సోదా చేయగా 200 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో గంజాయితో పాటు  రెండు సెల్ ఫోన్లు,  పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఎన్డీపీఎస్‌ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులను పట్టుకున్న మెట్ పల్లి సీఐ నవీన్ , ఎస్సై కిరణ్ కుమార్ , సిబ్బంది రాజేష్ , కిరణ్ , మారుతిలను అభినందించారు.