ములుగుకు 40 రోజుల్లో ముగ్గురు కలెక్టర్లు..మార్పుల వెనుక మర్మమేందో..!

ములుగుకు 40 రోజుల్లో  ముగ్గురు కలెక్టర్లు..మార్పుల వెనుక మర్మమేందో..!

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు:  మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు కేవలం వారం రోజుల గడువే ఉండగా, మంగళవారం రాత్రి ములుగు జిల్లా ఇన్​చార్జి కలెక్టర్​ను ప్రభుత్వం అకస్మాత్తుగా మార్చింది. గడిచిన 40 రోజుల్లో ముగ్గురు కలెక్టర్లు మారడం చర్చనీయాంశమవుతోంది.

మూడుసార్లు మార్పు

తెలంగాణ రాష్ట్రంలోనే అతిచిన్న జిల్లా ములుగు. 2019 ఫిబ్రవరి 17 నుంచి ఉనికిలోకి వచ్చింది. తొలుత జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లుకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజులకే పూర్తిస్థాయి కలెక్టర్​గా సి.నారాయణరెడ్డిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే ప్రస్తుత మేడారం జాతర పనులు ప్రారంభమయ్యాయి. అంతలోనే  గతేడాది డిసెంబర్22న నిజామాబాద్​ జిల్లా కలెక్టర్ గా ఆయనను ట్రాన్స్​ఫర్​ చేశారు.  నారాయణరెడ్డి కేవలం 9 నెలల 18 రోజులు మాత్రమే పనిచేశారు. ఆయన స్థానంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్​ వెంకటేశ్వర్లుకు ఇన్​చార్జి బాధ్యతలు అప్పగించారు.  మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నిక్కచ్చిగా వ్యవహరించడంతో గిట్టని రాజకీయ నాయకులు నారాయణరెడ్డిని బదిలీ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. ములుగు జిల్లా ఇన్​చార్జి కలెక్టర్​గా బాధ్యతలు తీసుకున్న వెంటనే వాసం వెంకటేశ్వర్లు సైతం మేడారం జాతర పనులపై దృష్టి పెట్టారు. పనులను వేగవంతం చేయించడానికి కృషి చేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రెండు చోట్ల జెండావిష్కరణ సైతం చేశారు. ఇంతలోనే ములుగు జిల్లా ఇన్​చార్జి బాధ్యతల నుంచి వెంకటేశ్వర్లును తప్పించి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్​కు అప్పగిస్తూ సీఎస్​ సోమేశ్​కుమార్​ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ములుగు జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్​ను నియమిస్తే అసలు చర్చ ఉండేది కాదు. కానీ కర్ణన్​ను కూడా ఇన్​చార్జి కలెక్టర్​గానే నియమించడంపై తీవ్ర చర్చ జరగుతోంది. మేడారం జాతరకు వారం రోజుల ముందు రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకున్న నిర్ణయంలోని ఆంతర్యమేంటో అంతుచిక్కడం లేదు.

మరోసారి కర్ణన్కే..

2018 మేడారం మహా జాతర ముందు కూడా అప్పటి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళిని ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పట్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్​కు భూపాలపల్లి ఇన్​చార్జి కలెక్టర్​గా బాధ్యతలు అప్పగించారు. ఇన్​చార్జి కలెక్టర్​గా మేడారం జాతరను ఆయనే లీడ్​ చేశారు. ఇదే సంప్రదాయాన్ని తాజాగా ప్రభుత్వం కొనసాగించింది. 2020 మహాజాతర ముందు కూడా కర్ణన్​కే అవకాశం కల్పించడం విశేషం. నాడు కలెక్టర్​గా జాతర ను సక్సెస్​ చేయడం వల్లే ఆయనకు మరోసారి చాన్స్​ ఇచ్చారని  కొందరు చెబుతున్నారు. మరికొందరు మాత్రం జిల్లా పంచాయతీ అధికారిని సస్పెండ్​ చేయాలని తాను ఆదేశించినా కలెక్టర్​ వాసం వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడం వల్లే పంచాయతీరాజ్​ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు ఆయనను ఇన్​చార్జి బాధ్యతలనుంచి తప్పించారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.