ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయండి.. వర్షం వస్తే రైతులకు తీవ్ర నష్టం

ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయండి.. వర్షం వస్తే రైతులకు తీవ్ర నష్టం
  •     మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి 

ఖిలా వరంగల్(మామునూరు)/కాశీబుగ్గ, వెలుగు: ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి కోరారు. శనివారం శివనగర్‌‌‌‌లోని సీపీఐ జిల్లా ఆఫీసులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు నామమాత్రంగానే జరుగుతున్నాయన్నారు.

పొలాల్లో, రోడ్లపై వరికుప్పలు దర్శనమిస్తున్నాయన్నారు. వర్షం పడితే రైతుల ఆరు నెలల శ్రమ వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గన్నీ సంచులు, లారీల కొరతతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని వాపోయారు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ సరిగ్గా అమలుకావడం లేదన్నారు. 

ప్రభుత్వ భూములు ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. గుడిసెలు వేసుకొని నివసిస్తున్న పేదలకు పట్టాలు ఇచ్చి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షేక్ బాష్‌‌‌‌మియా, మేకల రవి, పంజాల రమేశ్, దండు లక్ష్మణ్, పనాస ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.