అట్రాసిటీ కేసుల్లో తొందరగా న్యాయం జరగాలి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్

అట్రాసిటీ కేసుల్లో తొందరగా న్యాయం జరగాలి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగంగా పూర్తిచేసి సాధ్యమైనంత తొందరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సంబంధిత అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. బుధవారం  కొంగరకలాన్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో  బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే పకడ్బందీగా దర్యాప్తు జరపాలన్నారు.  పూర్తి ఆధారాలను సేకరించి చార్జిషీట్ ఫైల్ చేయాలన్నారు. లేకపోతే రోజుల తరబడి కేసులు పెండింగ్ లో ఉండి.. బాధితులకు న్యాయం దక్కడంలో ఆలస్యమవుతుందన్నారు.  కేసు నమోదైన తర్వాత ఎఫ్ఐఆర్ తో పాటు బాధితుల ఆధార్ కార్డు, బ్యాంక్ వివరాలను సకాలంలో కలెక్టరేట్ కు సమర్పించాలని, తద్వారా పరిహారాన్ని ఇన్​టైంలో అందించగలమని తెలిపారు.  సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ ఉన్నతాధికారులు, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రామారావు,  గిరిజన సంక్షేమ అధికారి రామేశ్వరి దేవి  పాల్గొన్నారు.

రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేయాలి

 వచ్చే నెల 4న సిటీలో జరగనున్న అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారని.. ఆమె పర్యటన నేపథ్యంలో బందోబస్తు, ఇతర ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో ఆయన అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. రాష్ట్రపతి స్పెషల్ ఫ్లైట్ లో హకీంపేటలోని ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు. ద్రౌపది ముర్ము పర్యటన మార్గాల్లో రోడ్లకు రిపేర్లు చేపట్టి, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. బందోబస్తు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రొటోకాల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు ఉండొద్దన్నారు. సమావేశంలో ఆర్డీవో చంద్రకళ, డీఎంహెచ్ వో వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బీ అధికారి శ్రవణ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.