న్యూఢిల్లీ: ఉద్యోగుల నుంచి కట్ చేసిన పీఎఫ్ అమౌంట్‌ను వారి పీఎఫ్ అకౌంట్లలో డిపాజిట్ చేయకపోవడంతో స్పైస్‌జెట్ ఎండీ అజయ్ సింగ్, మరికొంత మంది టాప్ మేనేజ్‌మెంట్‌పై ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కేసు ఫైల్ చేసింది. ఈ కంపెనీ రూ.65.7 కోట్లను డిపాజిట్ చేయడంలో ఫెయిలైందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ పేర్కొంది.
కాగా, కంపెనీ తన పీఎఫ్ బకాయిలను తీర్చిన తర్వాత రోజే ఈ కేసు వివరాలు బయటకు వచ్చాయి. ఈపీఎఫ్‌ఓ ఫిర్యాదు ప్రకారం, స్పైస్‌జెట్‌లో 10 వేల మంది పనిచేస్తున్నారు. జూన్, 2022 నుంచి జులై, 2024 మధ్య వీరి జీతాల్లో 12 శాతాన్ని పీఎఫ్ కింద కట్ చేశారు. సాధారణంగా పీఎఫ్ కట్ చేసిన 15 రోజుల్లోపు వీరి పీఎఫ్ అకౌంట్లకు ఈ అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేయాలి. కానీ, స్పైస్‌జెట్ విషయంలో ఇది జరగలేదు. ఢిల్లీ పోలీస్‌కు చెందిన ఎకనామిక్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) కిందటి నెల 16 న కేసు రిజిస్టర్ చేసుకుంది.