రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ' స్పిరిట్ '. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే దీనిపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవి పాత్రపై ఫుల్‌స్టాప్!
గత కొన్ని రోజులుగా 'స్పిరిట్' మూవీలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారంటూ సోషల్ మీడియాలో కథనాలు హల్ చల్ చేస్తున్నాయి. అది కూడా ప్రభాస్ తండ్రి పాత్రలో అని, మరి కొందరు మరో కీలక పాత్రలో నటిస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, 'జిగ్రీస్' టీమ్‌తో సంభాషణలో భాగంగా సందీప్ రెడ్డి ఈ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు. 'స్పిరిట్' సినిమాలోప్రభాస్ తండ్రి పాత్రలోగానీ, ఇతర ఏ పాత్రలోగానీ చిరంజీవి నటించడం లేదని తేల్చిచెప్పారు. అవన్నీ కేవలం పుకార్లే మాత్రమే. అభిమానులు వాటిని నమ్మవద్దు అని స్పష్టత ఇచ్చారు.
మెగాస్టార్ తో సోలో సినిమా..
అయితే.. మెగాస్టార్‌తో కలిసి భవిష్యత్తులో తప్పకుండా ఒక సోలో యాక్షన్ ఫిల్మ్ చేస్తానని, ఇలా ప్రత్యేక పాత్రలతో తాను సంతృప్తి చెందనని కూడా సందీప్ రెడ్డి వంగా ప్రకటించారు. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌ను తెరపై చూడాలనుకున్న మెగా అభిమానుల్లో కొంత నిరాశ వ్యక్తమైనా.. భవిష్యత్తులో ఒక సోలో సినిమా ఉంటుందనే హామీతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
డాన్ లీ ఎంట్రీపై మిస్టరీ!
'స్పిరిట్' చిత్రానికి మరింత గ్లోబల్ లుక్ తీసుకురావడానికి, దక్షిణ కొరియా నటుడు మా డాంగ్-సియోక్ ( డాన్ లీ), ప్రభాస్‌కు విలన్‌గా నటించబోతున్నాడనే మరో పెద్ద వార్త చక్కర్లు కొడుతోంది. 'ట్రైన్ టు బుసాన్', మార్వెల్ 'ఎటర్నల్స్' వంటి చిత్రాల ద్వారా అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న డాన్ లీని విలన్ పాత్ర కోసం సంప్రదించినట్లు కొరియన్ మీడియా కూడా గతంలో ప్రకటించింది. ఈ విషయంపై సందీప్ రెడ్డి వంగాను అడగ్గా, ఆయన డాన్ లీ పాత్ర గురించి ఖండించలేదు, ధృవీకరించనూ లేదు. ఈ మౌనం ప్రాజెక్ట్ యొక్క గ్లోబల్ కాస్టింగ్ ఆశయాలపై, విలన్ పాత్రపై మరింత ఆసక్తిని పెంచుతోంది. వివేక్ ఒబెరాయ్ , ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రల్లో ఉండగా, అంతర్జాతీయ స్టార్‌ను రంగంలోకి దించితే 'స్పిరిట్' రేంజ్ ఊహకందని విధంగా మారడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
IPS అధికారిగా ప్రభాస్..
భూషణ్ కుమార్ నేతృత్వంలోని టీ-సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని రీతిలో పవర్‌ఫుల్, సిన్సియర్ ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అకాడమీ టాపర్ అయినప్పటికీ, కథలోని మర్మమైన పరిస్థితుల కారణంగా ప్రభాస్ జైలు పాలవుతాడు. ఇదే ఈ కథలోని ముఖ్యమైన 'ట్విస్ట్' అని తెలుస్తోంది. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'సౌండ్ స్టోరీ' టీజర్ కేవలం ఆడియోతోనే సినిమా టోన్, ఇంటెన్స్‌ను పరిచయం చేసి అభిమానుల్లో థ్రిల్‌ను నింపింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి నటిస్తోంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2026 మధ్యలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
