గండిపేట, వెలుగు: అత్తాపూర్‌లోని బార్బీక్యూ నేషన్ బ్రాంచ్‌పై హెచ్–ఫాస్ట్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. రెస్టారెంట్ కిచెన్ అత్యంత అపరిశుభ్రంగా దర్శనమిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పాడైపోయిన చికెన్, మూడు కేజీల మటన్, రెండు ఫిష్‌లు, గడువు ముగిసిన ఐస్‌క్రీమ్‌లు, కుళ్లిపోయిన పండ్లను గుర్తించారు. ఫ్రిజ్‌లో దాచిన పాత, పాడైపోయిన మాంసంపై ఉన్న పాత డేట్ స్టిక్కర్లను తొలగించి.. అది ఈరోజే ప్యాక్ చేసినట్టు కొత్త స్టిక్కర్లను అంటించి ప్రమాదకరమైన మాంసాన్నే కస్టమర్లకు వడ్డిస్తున్నట్టు తనిఖీల్లో తేల్చారు.
గతంలోనూ ఇదే అత్తాపూర్ బార్బీక్యూ నేషన్‌పై అధికారులు దాడులు చేసి, లోపాలను గుర్తిస్తూ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ, యాజమాన్యం తీరులో ఎలాంటి మార్పు రాలేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇలాంటి హోటళ్ల లైసెన్సులను తక్షణమే రద్దు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వినియోగదారుల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించేలా గడువు ముగిసిన, పాడైపోయిన మాంసాన్ని విక్రయిస్తున్నట్టు తమ తనిఖీల్లో తేలిందని ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్యరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను ల్యాబ్‌కు పంపిస్తున్నామని చెప్పారు. నిబంధనలు పాటించని యాజమాన్యంపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
