
స్పోర్ట్స్ పాలసీపై క్రీడాకారులతో సమావేశమైన మంత్రి శ్రీనివాస్ గౌడ్
త్వరలో ప్రకటించనున్న తెలంగాణ స్పోర్ట్స్ పాలసీపై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం క్రీడాకారులతో సమావేశం అయ్యారు. రవీంద్రభారతిలోని స్పోర్ట్స్ మినిష్టర్ ఛాంబర్ లో జరిగిన ఈ సమావేశంలో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, బాడ్మింటన్ ప్లేయర్స్ సిక్కి రెడ్డి, సాయి ప్రణీత్, సుమిత్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎమ్.డి. శ్రీనివాస్ రాజు, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఐటీ సెక్రెటరీ జయేష్ రంజన్, చాముందేశ్వరినాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కరోనా వల్ల ఆర్థిక సంక్షోభంతో పాటు… క్రీడారంగం కూడా తీవ్రంగా నష్ట పోయిందని అన్నారు. తెలంగాణలో ప్రకటించనున్న కొత్త క్రీడా పాలసీపై… రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని, స్పోర్ట్స్ పాలసీపై తమ సలహాలు, సూచనలు ఇవ్వడానికి సీనియర్ ప్లేయర్లు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. లాక్ డౌన్ తర్వాత యోగ సెంటర్లు, జిమ్ లు ఆగస్టు 5వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నామని, తక్కువ మందితోనే ఫిట్ నెస్ సెంటర్లు నడిపాలని సూచించారు. సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ… ఆగస్టు 5వ తేదీ నుంచి స్టేడియాలలో ఆటగాళ్లు ఆడుకోవచ్చన్నారు. టోర్నమెంట్‌లు నిర్వహించేందుకు అనుమతి లేదని చెప్పారు.