
హనుమకొండ, వెలుగు: ఓరుగల్లులో ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ ను ఓపెన్ కానుంది. స్పోర్ట్స్ స్కూల్ ఓపెనింగ్ కు తాత్కాలిక బిల్డింగ్ తో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు తెలంగాణ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేశ్‌రంజన్ కు విన్నవించగా, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్పెషల్ చీఫ్ సెక్రెటరీని హైదరాబాద్ టూరిజం ప్లాజాలోని ఆఫీస్ లో బుధవారం ఎమ్మెల్యేలు కలిశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్పోర్ట్స్ స్కూల్, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల వద్ద ఎన్‌హెచ్-163ని ఆనుకుని 20 ఎకరాల ప్రభుత్వ స్థలంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ ఆగస్టు 15న స్పోర్ట్స్ స్కూల్ ను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.