
- 13 జిల్లాల్లో టీచర్ల స్పౌజ్ ట్రాన్స్ ఫర్లకు బ్రేక్
- మాట ఇచ్చి తప్పిన సర్కారు
- మొదట అవుట్ గోయింగ్‌కు అవకాశం
- ఇప్పుడు ఇన్‌కమింగ్‌కు నో
- ఖాళీలు తక్కువ ఉన్నాయనే సాకులు
- ఆందోళనలో వేలాది టీచర్ జంటలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో పనిచేసే టీచర్ మధుకర్ ఆప్షన్ అలాట్మెంట్లో భాగంగా సిద్దిపేట జిల్లాకు వచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో ఆయన భార్య పనిచేస్తుండడంతో కలిసి ఉండవచ్చని భావించారు. కానీ ఉమ్మడి మెదక్ జిల్లా అలాట్మెంట్లో ఆయన భార్య ను సిద్దిపేట నుంచి మెదక్ జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారు. స్పౌజ్ కేటగిరీలో భాగంగా ఆమెను తిరిగి సిద్దిపేట జిల్లాకు కేటాయించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం టీచర్స్ స్పౌజ్ ట్రాన్స్ ఫర్లను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో సిద్దిపేట జిల్లా ఉండడంతో ఇప్పుడు వాళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. భర్త సిద్దిపేట జిల్లాలో భార్య మెదక్ జిల్లాలో వేర్వేరు చోట్ల పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సిద్దిపేట, వెలుగు: టీచర్ల స్పౌజ్ ట్రాన్స్ ఫర్ల విషయంలో సర్కారు మాట మార్చింది. ఆప్షన్ల ప్రకారం జిల్లాల అలాట్మెంట్లు పూర్తయ్యాక స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు చేస్తామని చెప్పి ఇప్పుడు 13 జిల్లాల్లో నిలిపివేసింది. స్పౌజ్ ట్రాన్స్ ఫర్ల వల్ల కీలక జిల్లాల్లో ఎస్జీటీ ఖాళీలు లేకుండా పోతాయని, ఎన్నికల ముందు టీచర్పోస్టులకు నోటిఫికేషన్ వేస్తే నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఈ జిల్లాలను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కారణం వల్లే సీఎం సొంత జిల్లా సిద్దిపేటలో కూడా స్పౌజ్ ట్రాన్స్ఫర్లు నిలిపివేశారని టీచర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. సర్కారు తాజా నిర్ణయంతో ఆయా జిల్లాల్లో వేలాది మంది టీచర్ జంటలు వేర్వేరు జిల్లాల్లో పనిచేయాల్సి వస్తోంది.
అప్లికేషన్లు తీసుకొని పక్కన పెట్టారు..
ట్రాన్స్ఫర్ల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ భార్యాభర్తలను విడదీయవద్దని స్వయంగా సీఎం కేసీఆర్ఆఫీసర్లకు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు తగినట్లే ఆప్షన్ల ప్రకారం జిల్లాల అలాట్మెంట్లు పూర్తయ్యాక స్పౌజ్ ట్రాన్స్ ఫర్లకు చాన్స్ ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన బదిలీల్లో జిల్లాల అలాట్మెంట్ తర్వాత జాయిన్ అయ్యేటప్పుడే స్పౌజ్ ట్రాన్స్‌ఫర్స్‌కు చాన్స్ ఉన్నవాళ్ల నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు. భార్యాభర్తల డ్యూటీ సర్టిఫికేట్లను జత చేసి డీఈఓ ఆఫీసుల్లో గత నెలలోనే తీసుకున్నారు. స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్ కోసం స్టేట్‌వైడ్‌గా అన్ని జిల్లాల నుంచి వచ్చిన అప్లికేషన్లను డీఈఓలు డైరెక్టరేట్ టూ స్కూల్ ఎడ్యుకేషన్‌కు పంపించగా కేవలం 19 జిల్లాల్లో మాత్రమే స్పౌజ్ ట్రాన్స్ ఫర్లకు పర్మిషన్ ఇచ్చారు. జనవరి 5న స్పౌజ్ కేసులను ప్రత్యేకంగా పరిశీలించి పోస్టింగ్‌లు కూడా ఇచ్చేశారు. టీచర్ స్పౌజ్ ట్రాన్స్ ఫర్లకు సంబంధించి హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి దాదాపు4 వేలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. వీటిలో 19 జిల్లాల్లో దాదాపు 1500 పైగా ట్రాన్స్ ఫర్లను పూర్తి చేసిన ప్రభుత్వం మిగిలిన 13 జిల్లాల్లో మాత్రం బ్లాక్ చేసింది.
ఆ జిల్లాలు ఇవే..
ప్రభుత్వం బ్లాక్ చేసిన జిల్లాల్లో రంగారెడ్డి, మేడ్చల్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేట, మహబూబ్ నగర్, మంచిర్యాల, సూర్యాపేట ఉన్నాయి. ఈ 13 జిల్లాల నుంచే సుమారు 2 వేల వరకు స్పౌజ్ అప్లికేషన్లు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయం ఫలితంగా ఇప్పుడు 1,110 మంది ఎస్జీటీ, ఇతర కేటగిరీల్లోని 1,456 మంది టీచర్స్ కు సంబంధించి స్పౌజ్ ట్రాన్స్ ఫర్లు నిలిచిపోయాయి. స్పౌజ్ ట్రాన్ఫ్ ఫర్స్ సమస్య ను భవిష్యత్తులో ఎలా పరిష్కరించబోతున్నారనే విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేకపోవడంతో టీచర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. 13 జిల్లాల్లో ఖాళీలు తక్కువ ఉండి, అప్లికేషన్లు ఎక్కువ రావడం వల్లే బ్లాక్ చేశామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఇలాంటప్పుడు సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల లీడర్లు కోరుతున్నారు. మొత్తంమీద ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీఓ వల్ల ఇప్పటికే సీనియరిటీ, లోకాలిటీ వివాదం నడుస్తుండగా, తాజాగా స్పౌజ్ ట్రాన్స్ ఫర్ల ను నిలిపివేయడంతో భవిష్యత్తులో తమ పిల్లలకు స్థానికత విషయంలో సమస్యలు వస్తాయని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. కాగా, రానున్నది ఎన్నికల సంవత్సరం కావడంతో టీచర్ల నియామకం చేపట్టే అవకాశం ఉంది. కానీ స్పౌజ్ ట్రాన్స్ ఫర్ల కారణంగా కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ పోస్టులు ఖాళీ లేకుండా పోతాయి. ఇదే జరిగితే నిరుద్యోగుల నుంచి నిరసన తప్పదని భావించే చివరి నిమిషంలో బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది.
మానవీయ కోణంలో పరిశీలించాలి
టీచర్స్ స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్ విషయాన్ని ప్రభుత్వం మానవీయ కోణంలో పరిశీలించాలి. మద్దూరులో పనిచేసే నేను 300 కిలో మీటర్ల దూరంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ట్రాన్స్ఫర్ అయ్యాను. నా భార్య సిద్దిపేట జిల్లాలో పనిచేస్తోంది. ఆ జిల్లాలో స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్ బ్లాక్ చేయడంతో నేను ఫ్యామిలీకి దూరమయ్యే పరిస్థితి ఉంది. ఈ విషయం లో ప్రభుత్వం పునరాలోచించాలి. నాలాంటి టీచర్లందరికీ న్యాయం చేయాలి
–ఎన్.చంద్రమౌళి, టీచర్
కేటగిరీల వారీగా చాన్స్ ఇవ్వాలి
జిల్లాల్లో ఖాళీలను బట్టి కేటగిరీల వారీగా స్పౌజ్ ట్రాన్స్ ఫర్స్ కు అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో ఖాళీలు తక్కువ ఉండి, ఎక్కువ మంది అప్లై చేసుకున్నప్పుడు సీనియారిటీని పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. ఈ విషయంలో టీచర్ జంటలకు అన్యాయం జరగకుండా చూస్తాం.
–కూర రఘోత్తం రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ