
ఇంఫాల్: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీలా కర్కికి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. సుశీలా కర్కి అత్యున్నత పదవికి చేరుకోవడం మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణ అని అన్నారు. సుశీలా కర్కి నేతృత్వంలో నేపాల్ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ప్రధాని మోడీ శనివారం (సెప్టెంబర్ 13) మణిపూర్ రాష్ట్రంలో పర్యటించారు. 2023 తర్వాత మణిపూర్‌లో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి.
ఈ సందర్భంగా మణిపూర్‌లో వివిధ అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేశారు మోడీ. అనంతరం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నేపాల్, ఇండియాకు మంచి మిత్రదేశమని పేర్కొన్నారు. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా బాధ్యతలు స్వీకరించిన సుశీలా కర్కికి 140 కోట్ల మంది భారతీయుల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టడం మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణ అన్నారు. కర్కి నాయకత్వంపై తనకు నమ్మకం పూర్తి నమ్మకం ఉందన్న మోడీ.. ఆమె నేపాల్‌లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు మార్గం సుగమం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నేపాల్ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. ఆందోళనలు తీవ్ర నిరసనల అనంతరం గత రెండు-మూడు రోజులుగా నేపాల్ యువత రోడ్లను శుభ్రచేయడం, రోడ్లపై పెయింటింగ్ పనులు చేస్తూ చాలా శ్రమిస్తున్నారని కొనియాడారు.
స్వచ్ఛందంగా ముందుకొచ్చిన యువత చిత్రాలు సోషల్ మీడియాలో తాను కూడా చూశానని.. నేపాల్ యువతకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కాగా, జెన్ జెడ్ యువత ఆందోళనలతో కేపీ శర్శ ఓలీ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో నేపాల్ అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ పార్లమెంట్ ను రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి బాధ్యతలు చేపట్టారు.