రష్యా నుంచి చమురు కొనడం ఆపేయండి: నాటో దేశాలకు ట్రంప్ కీలక పిలుపు

రష్యా నుంచి చమురు కొనడం ఆపేయండి: నాటో దేశాలకు ట్రంప్ కీలక పిలుపు

వాషింగ్టన్: నాటో కూటమి దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‎తో మూడేండ్లుగా యుద్ధం కొనసాగిస్తోన్న రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు ఆపేయాలని నాటో దేశాలకు సూచించారు. నాటో దేశాలన్నీ ఇందుకు అంగీకరిస్తే రష్యాపై భారీ ఆంక్షలు విధించడానికి అమెరికా కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ట్రంప్. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపేయడంతో పాటు ఆ దేశంపై కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించాలని చెప్పారు.

యుద్ధాన్ని నిలువరించే ప్రయత్నాల్లో నాటో కూటమి నిబద్ధత 100 శాతం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్..  నాటో కూటమిలోని కొన్ని దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఈ చర్య మాస్కోతో కూటమి చర్చల శక్తిని దెబ్బతీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే.. ఉక్రెయిన్‎పై యుద్ధం ఆపాలంటే రష్యాకు మిత్రదేశమైన చైనాపై నాటో కూటమి దేశాలు 50% నుంచి 100% సుంకాలను విధించాలని ట్రంప్ పిలుపునిచ్చాడు.

నాటో కూటమి ఐక్యంగా ఈ పని చేస్తే యుద్ధాన్ని ముగించడంలో కీలక ముందడుగు పడుతుందని.. ఎందుకంటే రష్యాపై చైనాకు బలమైన నియంత్రణ, పట్టు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు ట్రంప్. చైనాపై నాటో కూటమి దేశాలు భారీగా సుంకాలు విధిస్తే.. రష్యా, చైనా మధ్య బంధాలు క్షీణిస్తాయని.. అప్పుడు ఆటోమేటిక్‎గా రష్యా ఉక్రెయిన్‎పై దండయాత్రను ఆపుతుందన్నారు ట్రంప్. నాటో దేశాలు తాను చెప్పినట్లు చేస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగిస్తుందని.. ఇరుదేశాల్లో ఎన్నో ప్రాణాలు కాపాడబడతాయన్నారు. 

►ALSO READ | వైద్యచరిత్రలో సరికొత్త అధ్యాయం.. విరిగిన ఎముకలను కేవలం 3నిమిషాల్లోనే అతికించే బోన్ గ్లూ

ఒకవేళ తన ప్రతిపాదనలపై నాటో కూటమి దేశాలు చర్యలు తీసుకోకపోతే నా సమయం వృధా కావడంతో పాటు అమెరికా ప్రజల డబ్బు వేస్ట్ అవుతోందన్నారు ట్రంప్. కాగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న సాకుతో ఇండియాపై ట్రంప్ 25 శాతం అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫార్ములాను నాటో కూటమి దేశాలకు సూచించాడు ట్రంప్. మరీ ట్రంప్ ప్రతిపాదనలను నాటో దేశాలు పరిగణలోకి తీసుకుంటాయా..? ఆయన చెప్పినట్లుగా చైనాతో పాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న దేశాలపై టారిఫ్‎లు విధిస్తాయా చూడాలి.