
హైదరాబాద్, వెలుగు: తమకు బదిలీలు చేపట్టి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని స్పౌజ్ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీచర్ల దంపతులతో పాటు వారి పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. 13 జిల్లాల్లో నిలిచిపోయిన స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలని కోరుతూ ఆవేదన సభ నిర్వహించారు. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో దాదాపు 18 నెలలుగా నరకయాతన అనుభవిస్తున్నామన్నారు. 13 జిల్లాల్లో మిగిలిపోయిన 1,600 మందిని బదిలీలు చేయడం పెద్ద సమస్యేమీ కాదన్నారు. ఈ ధర్నాలో టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు, టీపీటీఎఫ్, ఆర్‌యూపీపీ, టీఎస్టీయూ, పీఆర్టీయూటీ తదితర సంఘాల నేతలు పాల్గొని, మద్దతు ప్రకటించారు.
స్పౌజ్ బదిలీలు జరిగేంత వరకు బాధిత టీచర్లకు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే, ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌తో పాటు ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ.. 13 జిల్లాల్లో మిగిలిపోయిన స్పౌజ్ బదిలీలు జరిపేందుకు విద్యా శాఖ మంత్రి హామీ ఇచ్చారన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. టీచర్ దంపతులు ఒకే జిల్లాలో పనిచేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని స్పౌజ్ టీచర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ కోరారు. స్పౌజ్ ఫోరం రాష్ట్ర నాయకులు నరేశ్ మాట్లాడుతూ.. ఒకటీ రెండు క్యాడర్లు మినహా మిగతా అన్ని విభాగాల్లోనూ స్పౌజ్ బదిలీలు నిర్వహించడానికి 13 జిల్లాల్లో అవకాశం ఉందని చెప్పారు.