జైలులో సెల్ ఫోన్, స్పీకర్లు, స్పై కెమరా, స్మార్ట్ వాచ్.. ఈ ఖైదీకి విలాసం

జైలులో సెల్ ఫోన్, స్పీకర్లు, స్పై కెమరా, స్మార్ట్ వాచ్.. ఈ ఖైదీకి విలాసం

పంజాబ్ లో  ఖలిస్థాన్ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్ అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్నాడు. పంజాబ్ లో ఖలిస్తాన్ అనుకూలంగా రాడికల్ ఖలిస్తానీ అనేక ప్రదేశాలు తిరుగుతూ పంజాబ్ పోలీసులకు ముప్పతిప్పలు పెట్టారు.  ఎట్టకేలకు  మోగా జిల్లాలో ఏప్రిల్ 23, 2023న  అరెస్ట్ చేసి కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసు నమోదు చేశారు.  అమృతపాల్ సింగ్‌తో పాటు అతని తొమ్మిది మంది సహచరులు కూడా దిబ్రూఘర్ సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే  ఫిబ్రవరి 17న ఆ జైలులో అధికారులు జరిపిన సోదాలు ఎలక్ట్రానిక్ పరికరాలు బయటపడటం కలకలం రేపుతోంది. ఈ పరికరాలు అమృత్ పాల్ వినియోగించినట్లు తెలుస్తోంది.

సోదాల్లో అమృతపాల్ సింగ్ కు మంచి సౌకర్యాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.  జైలు నిబంధనలు ఉల్లంఘించి ఓ స్పై కెమెరా, స్మార్ట్‌ఫోన్, కీప్యాడ్ ఫోన్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లు, టివి రిమోట్, స్మార్ట్‌వాచ్ సహా అనేక ఇతర వస్తువులు రికవరీ చేసినట్లు జైలు ఉన్నతాధికారులు వెల్లడించారు. జైల్లోకి ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఉపయోగించారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాలను చెక్ చేస్తున్నారు. అనధికారికంగా ఈ వస్తువులు జైలులోకి ఎలా వచ్చాయని అధికారులు ఆరా తీస్తున్నారు. వాటి పనితీరును పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.