
శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మీని పూజించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజున ( ఆగస్టు 1) మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
శ్రావణ మాసం శుక్రవారాల్లో ఉపవాసముండి, అమ్మవారిని ప్రార్థించే వారికి దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరిసంపదలు వెల్లివిరుస్తాయి మహాలక్ష్మీ లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునే వారికి పుణ్యఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. అమ్మవారికి ... మల్లెపువ్వులు, కస్తూరి, జాజిపువ్వులను అమ్మవారి కోసం సమర్పించి, ఆవు నేతితో దీపమెలిగించిన వారికి ఈతిబాధలు తొలగిపోయి, అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.
పూజావిధానం
- శ్రావణ శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించాలి.
- లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఇంటి ముందు అందమైన రంగవల్లులు వేయాలి.
- ఇంటి గుమ్మం కళకళలాడేలా మామిడి తోరణాలతో, పూలమాలతో అలంకరించాలి.
- పసుపు, కుంకుమ, అగరబత్తులు, కర్పూరం, గంధం, పన్నీరు, దీపం కుందులు, ఆవు నెయ్యి, ఒత్తులు, అక్షింతలు, పువ్వులు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, అరటి పిలకలు, తమలపాకులు, వక్కలు, తోరాలు , కలశం, అమ్మవారికి పట్టు వస్త్రాలు, అలంకరణకు ఆభరణాలు ఏర్పాటు చేసుకోవాలి.
- అమ్మవారిని ఫలపుష్పాలతో పూజించి... పాయసం, చక్కెరపొంగలి, పరమాన్నం వంటి నైవేద్యాలను సమర్పించాలి. వీటితోపాటు పూర్ణంబూరెలను కూడా ప్రసాదంగా వండితే మంచిదంటారు పెద్దలు.
- మధ్యాహ్నం భోజనానికి ఒక ముత్తయిదువను ఆహ్వానించాలి. . ఆమెను సాక్షాత్తూ లక్ష్మీదేవిగా భావించి, భోజనాది సత్కారాలతో సేవించి, తాంబూలంతో పాటు నూతన వస్త్రాలను అందిస్తారు.
- పూజా సమయంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి , దుర్గాష్టకం లేదా అమ్మవారి శ్లోకములతో స్తుతించాలి.
- శ్రావణ శుక్రవారం పూట తులసీపూజ, ఆలయాల్లో పాలు, తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి