Sravana Masam 2025: శ్రావణమాసంలో సోమ.. మంగళ.. శుక్ర వారాల్లో చేయాల్సిన పూజలు ఇవే..!

Sravana Masam 2025: శ్రావణమాసంలో సోమ.. మంగళ.. శుక్ర వారాల్లో చేయాల్సిన పూజలు ఇవే..!

హిందూ మతంలో  శ్రావణమాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.  విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణం పేరున శ్రావణ మాసం ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి.  అందుకే ఈ నెలలో పూజలు.. వ్రతాలు.. నోములు ఆచరిస్తారు.  శ్రావణమాసం అంటే ఒక్క లక్ష్మీదేవికే కాదు... విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. ఈ నెల శివుడికి .. పార్వతిదేవికి చాలా ఇష్టం.  ఈ నెలలో చేసే పూజలు విశేష ఫలితాలు ఇస్తాయని  ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.  ఈ నెలలో ప్రతి రోజుకు  ప్రాముఖ్యత  ఉంటుంది.  ఏ రోజు ఎలా పూజ చేయాలి.. ఏ దేవుడిని పూజించాలి.. పండితులు తెలిపిన వివరాల ప్రకారం  ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .

శ్రావణ సోమవారం : పరమేశ్వరునికి కూడా శ్రావణం ఎంతో ప్రీతికరమైనది.   శ్రావణ సోమవారాల్లో మహాశివుడికి అభిషేకాలు, అర్చనలు చేయాలి.  శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయి. ఇంట్లో కూడా శివలింగాన్ని లేదా శివుడి ఫోటోను పూజించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఆ రోజుల్లో (  జులై 28, ఆగస్టు 4, 11,18) తెల్లవారుజామునే  కాలకృత్యాల అనంతరం శివలింగానికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, విభూదితో అభిషేకం చేయాలి. బిల్వ పత్రాలు, జిల్లేడు పూలు, మారేడు దళాలు, అక్షింతలు, తెల్లటి పువ్వులతో శివుడిని అలంకరించాలి. శివనామాలను, శివ స్తోత్రాలను పఠించాలి. ధూపం, దీపం వెలిగించి నైవేద్యం సమర్పించాలి. ఉత్తరాదిన శ్రావణ సోమవారాల్లో శివారాధన అత్యంత వైభవంగా చేస్తారు. కాశి, ఉజ్జయిని, సోమనాథ్‌ వంటి శైవక్షేత్రాలు.. శ్రావణ సోమవారాల్లో భక్తులతో కిటకిటలాడుతాయి. ఈ రకంగా శివ కేశవ అభేదాన్ని ఈ మాసం చాటుతుంది.

 పూజ ఫలితం:  శ్రావణ సోమవారం పూజలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరతాయి. ఆరోగ్యం, సంపద, సంతోషం లభిస్తాయి. అంతే కాకుండా అవివాహిత యువతులకు మంచి భర్త లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. 

శ్రావణ మంగళవారాలు :  శ్రావణ  మంగళవారాలు మంగళ గౌరీ వ్రతానికి అంకితం చేయబడ్డాయి. మంగళ గౌరి అంటే పరమేశ్వరుని భార్య పార్వతి దేవి.  ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం, సౌభాగ్యం కోసం నిర్వహిస్తారు. 
అమ్మవారి మాంగల్యబలంతో శివుడు ఈ పని చేసాడు.  కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. జాతకములో కుజదోషం, కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు వంటి దోషాలు ఉన్నవారు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే వారి దోష నివృత్తి అవుతుందని పండితులు చెబుతున్నారు. మంగళగౌరి వ్రతం గురించి నారదమహర్షి సావిత్రీదేవికి చెప్పినట్లుగా, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలలో ఉంది . అందుకే  శ్రావణ మంగళవారం రోజుల్లో  ( జులై 29.ఆగస్టు 5, 12,19)   ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. గౌరీదేవి ప్రతిమను లేదా ఫోటోను ప్రతిష్ఠించి పూజించాలి. పసుపు గణపతిని పూజించి, నవగ్రహాలకు పూజలు చేయాలి. 16 దారపు పోగులతో 16 ముడులు వేసి, వాటికి 16 పసుపు కొమ్ములు కట్టి పూజించాలి. శనగపిండితో దీపాలు వెలిగించి.. 16 రకాల పిండి వంటలు, పూలతో గౌరీదేవిని పూజించాలి.

ఫలితాలు: మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల దీర్ఘ సుమంగళి యోగం, భర్తకు సంపూర్ణ ఆరోగ్యం, పిల్లలకు మేలు జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. 

శ్రావణ శుక్రవారాలు – వరలక్ష్మీ వ్రతం:శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే  శుక్రవారం ( ఆగస్టు 8) న వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈ వ్రతాన్ని వివాహిత స్త్రీలు సిరి సంపదలు, సౌభాగ్యం, ఐశ్వర్యం కోసం ఆచరిస్తారు.ఆ రోజున ఉదయాన్నే శుచిగా స్నానం చేసిఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా ఫోటోను అలంకరించి, పువ్వులు, పండ్లతో పూజించాలి. అష్టలక్ష్మి అష్టోత్తర శతనామావళిని, లక్ష్మీ స్తోత్రాలను పఠించాలి. రకరకాల నైవేద్యాలు సమర్పించాలి.. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం మానవుల జీవితములో దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితిని నుంచి బయటకు రావడానికి వరలక్ష్మీ వ్రతాన్ని మించిన వ్రతం లేదని పురాణాలు చెబుతున్నాయి.  వరలక్ష్మీ వ్రతము గురించి స్కంద పురాణములో  స్పష్టంగా మునులు పేర్కొన్నారు. 

ఫలితాలు: వరలక్ష్మీ వ్రతం ఆచరించడం వల్ల ధన ధాన్య వృద్ధి, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. కుటుంబంలో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. శ్రావణ మాసంలో  పెళ్లికాని యువతులు మంచి భర్త కోసం, వివాహిత స్త్రీలు తమ కుటుంబ సౌభాగ్యం కోసం, పిల్లలు లేనివారు సంతానం కోసం, ఐశ్వర్యం కోరుకునేవారు ధన వృద్ధి కోసం శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.