శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఇంట్లో ఐటీ సోదాలు

శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ ఇంట్లో ఐటీ సోదాలు

చేవెళ్ల, వెలుగు : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో శనివారం సాయంత్రం పట్టుబడ్డ రూ.7.50 కోట్లు శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ కేటీ మహి ఇంటి నుంచే వచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భారీ మొత్తంలో క్యాష్ పట్టుబడటంతో పోలీసులు వెంటనే ఐటీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. 20 మందితో కూడిన ఐటీ టీమ్ రంగంలోకి దిగింది. శనివారం సాయంత్రం నుంచే అజీజ్​నగర్​లోని కేటీ మహి ఇంట్లో సోదాలు ప్రారంభించింది. ఆదివారం తెల్లవారుజాము దాకా ఈ సోదాలు కొనసాగాయి. మహి ఇంటితో పాటు ఫుట్​బాల్ కోర్టు, క్రికెట్ అకాడమీ ఆఫీసుల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు జరిపారు.

ఈ సోదాల్లో మహి ఇంటి నుంచి రూ.12లక్షల క్యాష్, విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో ఉన్న కొన్ని లాకర్లు తెరుచుకోకపోవడంతో ఐటీ అధికారులు వాటిని సీజ్ చేశారు. కేటీ మహి ఇంటి నుంచి వచ్చిన డబ్బులు ఎవరివి? ఎక్కడికి వెళ్తున్నాయి? అనే విషయాలు మాత్రం పోలీసులు మీడియాకు చెప్పకుండా గోప్యంగా ఉంచుతున్నారు.

తనిఖీల్లో పట్టుబడ్డ రూ.7.50 కోట్లను కోర్టులో డిపాజిట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ పార్టీ నేత సమీప బంధువుల రెండు కార్లను సీజ్ చేశారు. 10 మందికి 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. కేటీ మహి ఇంటి నుంచే క్యాష్ బయటకు వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తున్నది.