వైభవంగా శ్రీశైల మల్లన్న రథోత్సవం

వైభవంగా శ్రీశైల మల్లన్న రథోత్సవం

కర్నూలు: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వ రోజైన శుక్రవారం నాడు స్వామి అమ్మవారికి విశేష పూజల అనంతరం సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ముందుగా రథాంగ పూజ, రథాంగ హోమం, రథాంగ బలి కార్యక్రమాలు నిర్వహించారు. వసంతంతో నింపిన గుమ్మడి కాయలు, కొబ్బరికాయలు, కుంభం (అన్నం రాశి) సాత్విక బలిగా సమర్పించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవారలను రథంపైకి వేంచేబు చేయించి రథోత్సవం జరిపించారు. రథోత్సవ దర్శనం వలన సర్వ పాపాలు తొలగిపోతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. రథోత్సవాన్ని పురస్కరించుకుని బంతి, చామంతి, గులాబీలు, కాగడాలు, కనకాంబరాలు మొదలైన 11 రకాల పూలతో రథాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఆలయ ప్రధాన ద్వారం వద్ద దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఆధ్వర్యంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు.