రేపే లంక అధ్యక్ష ఎన్నిక.. ముగ్గురి నామినేషన్

రేపే లంక అధ్యక్ష ఎన్నిక.. ముగ్గురి నామినేషన్

శ్రీలంక అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో ఇవాళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడి అభ్యర్ధిత్వం కోసం ముగ్గురు ఎంపీలను నామినేట్ చేశారు. సింగపూర్ కు పరారైన మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రాతినిధ్యం వహించే పార్టీ ‘శ్రీలంక పొడుజన పెరమున’ (ఎస్ఎల్పీపీ) నుంచి అభ్యర్థిగా దుల్లాస్ అలహప్పేరుమను నామినేట్ చేశారు. తాత్కాలిక అధ్యక్షుడు, యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్పీ)  నేత రణిల్ విక్రమసింఘేతో పాటు జనతా విముక్తి పెరమునయ్ (జేవీపీ) పార్టీ నేత అనురా కుమార దిస్సానాయకే కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాగీ జన బలవేగయా (ఎస్జేబీ) నేత సజిత్ ప్రేమదాస కూడా అధ్యక్ష పదవికి నామినేషన్ వస్తాయని వార్తలు వచ్చాయి. అయితే తాను ఎస్ఎల్పీపీ నేత దుల్లాస్ అలహప్పేరుమకే మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు. శ్రీలంక ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు. వృత్తిరీత్యా జర్నలిస్టు అయిన దుల్లాస్ అలహప్పేరుమ గతంలో మహింద రాజపక్స కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు.  

పార్లమెంటులో బలాబలాలు.. 

1978 తర్వాత రెండోసారి లంకలో పార్లమెంటు సభ్యులంతా కలిసి దేశ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. శ్రీలంక పార్లమెంటులో మొత్తం 225 మంది సభ్యులు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఎస్జేబీకి పార్లమెంటులో 53 మంది ఎంపీల బలం ఉంది. రాజపక్స కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలంక పొడుజన పెరమున (ఎస్ఎల్పీపీ) పార్టీకి 103 సీట్లు ఉన్నాయి. ఎస్జేబీ మద్దతు కూడా లభించడంతో ఎస్ఎల్పీపీ అభ్యర్థి దుల్లాస్ అలహప్పేరుమకు విజయావకాశాలు పెరిగాయనే అంచనాలు వెలువడుతున్నాయి. మరో 43 మంది స్వతంత్ర ఎంపీలు కలిసి ఒక చీలిక వర్గాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. వీరి మద్దతు ఎవరికి లభిస్తుందనేది వేచి చూడాలి. రేపు (జులై 20న) శ్రీలంక అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరగనుంది. పార్లమెంటు సభ్యులంతా కలిసి దేశ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి ద్వారా ఎంపీలు ఓట్లు వేస్తారు. మొదటి, రెండో, మూడో ప్రాధాన్యం ప్రాతిపదికన ఓట్లు వేయాల్సి ఉంటుంది.  మొదటి ప్రాతినిధ్యం ప్రాతిపదికన ఎక్కువ ఓట్లు సాధించే వారే అధ్యక్ష స్థానానికి ఎన్నికవుతారు. కొత్తగా ఎన్నికయ్యే అధ్యక్షుడు 2024 నవంబరు వరకు పదవిలో ఉంటారు.